Sunday, May 16, 2021

ఒక వైపు క‌రోనా, మ‌రో వైపు మండే ఎండ‌లు…. మంద‌కొడిగా పోలింగ్

హైదరాబాద్, : కరోనా రెండో దశ వ్యాప్తి ఒక వైపు మండుటెండలు మరో వైపు నేపథ్యంలో రాష్ట్రంలోని వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్ధిపేట అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు, జడ్చెర్ల పుర పాలికలకు నేటి ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది..అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా, మంద‌కొడి కొనసాగుతున్నది… మొద‌టి రెండు గంట‌ల‌లో 13 శాతం పోలింగ్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.. ఒక వైపు కరోనా, మరో వైపు ఎండలతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు బయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి…చాలా పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి..సాధారంగా వేసవి కాలంలో జరిగే పోలింగ్ లో ఉదయం 3 గంటలలోనే అధిక సంఖ్యాకులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కు ఓటరు మహాశయులు ఆశించిన స్థాయిలో వస్తారా లేదా అన్న ఆందోళన అన్ని ప్రధాన రాజకీయ పక్షాల్లో వ్యక్తమవుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున్న తరలి వచ్చేందుకు ఆయా రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నా అవి ఎంతవరకు సఫలం అవుతాయన్న చర్చ జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండటం మినీ పురపోరులో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గుబులు రేపుతున్నాయి. సాధా రణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగిగితేనే పోలింగ్‌ నమోదు అంతంత మాత్రంగానే ఉంటుందని ఈ అనూహ్య పరిస్థి తుల్లో ఓటరు దేవుళ్ళు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు కాలు బయట పెడుతారా అన్న అనుమానాలను అభ్యర్థులు ముఖ్యమైన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఓటేసేందుకు నగర, పట్టణ వాసులు గతంతో పోలిస్తే ఆశించి నంతగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కోవిడ్‌ ప్రొటొకాల్స్‌ పాటించి ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటిస్తున్నా ఓటర్లు మాత్రం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు . ఇక ఇలాంటి సమయంలో పోలింగ్‌ శాతం ఏ మేరకు పెరుగుతుందని అధికారులు, రాజకీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించి ఓటర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు సిద్ధిపేట రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతాలు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికలేవైనా ఈ మూడు ప్రాంతాలు పోలింగ్‌ శాతంలో ముందువరుసలో ఉంటాయి. గత అసెంబ్లి, పార్లమెంట్‌ ఎన్నికల్లోఖమ్మం, వరంగల్‌ పరిధుల్లో తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. ఎన్నికలపై నగర ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. విద్యావంతుల్లో చాలా మంది ఓటుహక్కు వినియోగించు కోలేదు. అలాంటివి ప్రతీ ఎన్నికల్లోనూ సాధారణంగా జరిగేవేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
2018 డిసెంబర్‌ 6న జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో జిల్లాలో 86.51 శాతం పోలింగ్‌ నమోదైంది. ఖమ్మం నియోజక వర్గంలో మాత్రం 73.98 శాతానికే పరిమితమైంది. మిగతా 9 నియోజకవర్గాల్లోనూ 85 శాతానికి మించి పోలింగ్‌ జరిగింది. పార్లమెంట్‌ స్థానానికి జరిగిన ఎన్నికల పోలిం గ్‌లోనూ ఖమ్మం వెనుకంజలోనే ఉంది. 2019 ఏప్రిల్‌ 11న జరిగిన లోక్‌సభ ఎన్నికలో జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 82.95 శాతం పోలింగ్‌ నమోదైంది. ఖమ్మం మాత్రం 65.44 శాతానికే పరిమితమైంది. ఆ ఎన్నికలోనూ జిల్లాలోనే తక్కువ పోలింగ్‌ శాతం ఖమ్మంలోనే ఉంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే తక్కువగా ఖమ్మం పరిధిలో 71.38 శాతం పోలింగ్‌ నమోదైంది.
అప్పుడే 70 శాతం… మరిప్పుడు…?
గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవలం 67.68 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. 2016 మార్చి 6న నగరపాలక సంస్థకు గత ఎన్నికలు జరగ్గ మొత్తం 2 లక్షల 65వేల 710 ఓట్లు నమోదయ్యాయి. అందులో లక్షా 79వేల 827 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడే పోలింగ్‌ 70 శాతం దాటలేదు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు. మినీ పురపోరు ప్రచారం కేవలం రోడ్‌ షోలతోనే జరిగింది . కరోనా భయం వల్ల భౌతికదూరం పాటించేలా ఓటర్లు జాగ్రత్త పడ్డారు. ఎవర్నీ ఇంటి గేటుదాటి లోనికి రానివ్వలేదు. కనీసం గుర్తులు కూడా చూపించి దగ్గరగా వెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేటి పోలింగ్‌కు ఓటర్లు కదులుతారా..? అనేది రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగాన్ని తొలుస్తున్న ప్రశ్న. తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయితే ఏవ‌రికి అనుకూల‌మో అంటూ అప్పుడు పోటీలో ఉన్న పార్టీలు లెక్క‌లు వేసుకుంటున్నాయి.. ఇది ఇలా ఉంటే వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో మాజీ మంత్రి క‌డియం శ్రీ హ‌రి, జిల్లా క‌లెక్ట‌ర్ హనుమంతు గాంధీ , తదితరులు తొలి గంటలోనే తమ తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు..

ఒక వైపు క‌రోనా, మ‌రో వైపు మండే ఎండ‌లు…. మంద‌కొడిగా పోలింగ్
Advertisement

తాజా వార్తలు

Prabha News