Saturday, April 20, 2024

భూ విలువ గ‌రిష్టంగా 50 శాతం పెంపు….?

ధరణి పోర్టల్‌ సమయంలోనే
విలువల నిర్ధారణకు అధ్యయనం పూర్తి
అంచనాలతో నివేదిక సిద్ధం

హైదరాబాద్‌, : భూముల మార్కెట్‌ విలువలతోపాటు, స్టాంపు డ్యూటీని పెంచుకునే దిశగా సర్కార్‌ తుది నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. 2020-21లో రూ.6671 కోట్ల సవరించిన రాబడి అంచనాలను చేరలేక పోయిన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల లక్ష్యం 2021- 22 లో రూ.12,500 కోట్లకు పెంచుతూ అంచనాలు ప్రతిపాదించింది. కరోనా సంక్షోభం, ధరణి కారణంగా నాలుగు నెలలపాటు రిజిస్ట్రేషన్‌ సేవలు నిల్చిపోవడంతో ప్రస్తుత ఆర్థిక ఏడాది భారీ రాబడి లోటు సంభవిం చింది. దేశంలో రియల్‌ రంగం తెలంగాణలో దూసుకుపోతున్న నేపథ్యంతోపాటు రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలపడంతో భూములకు మహర్దశ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల విక్రయాలతో రూ.20 వేల కోట్లు, మార్కెట్‌ విలువల పెంపుతో రూ.12,500 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడింది. ప్రధానంగా రియల్‌ రంగం భారీగా పుంజుకున్నది. రియల్‌ వృద్ధితో జరుగుతున్న లావాదేవీలతో రాబడి సమీకరణకు మార్కెట్‌ విలువల సవరణ మార్గమని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో హైదరాబాద్‌ చుట్టూ 334 కిలోమీటర్ల పరిధిలో రియల్‌ వ్యాపారానికి ఢోకా లేకుండా పోనున్నది.
ఈ వార్షిక ఏడాదిలో మార్కెట్‌ విలువల పెంపుకు సిద్దమైనట్లేనని ప్రభుత్వం బడ్జెట్‌లోనే రాబడి అంచనాలను రూ.6671 కోట్ల నుంచి రూ. 12,500 కోట్లకు పెంచడంతోనే స్పష్టమైపోయింది. తద్వారా ఇప్పుడున్న రిజిస్ట్రేషన్‌ శాఖలోని బుక్‌ వాల్యూ పెంచి రాబడిని రెండింతలకు పెంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో రియల్‌ బూమ్‌తో భారీగా పెరిగిన భూముల ధరలకు వాస్తవ ధరలతో సమానంగా మార్కెట్‌ విలువలను నిర్ధారించి రిజిస్ట్రేషన్‌ రుసుముల రూపంలో రాబడి పెంచుకునేందుకు బడ్జెట్‌ అంచనాల రూపం లో ఆమోదముద్ర వేసింది. రిజి స్ట్రేషన్‌ రాబడికి మార్కెట్‌ విలువల సవరణ, గనులు, రవాణా శాఖల్లో రాబడి పెంపుకు బడ్జెట్‌లో అంచనాలను అందుకు అనుగు ణంగా పెంచు కుంది. భూములు, భవనాల మార్కెట్‌ విలు వల పున: సమీక్ష, సవరణ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఆగష్టులో చివరగా ఆమోదించారు. ఆ తర్వాత అవే ధరలను మార్కెట్‌ ధరలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భా వానికి ముందు 2013లో ఉమ్మడి రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించారు. ప్రతి రెండేళ్లకోసారి మార్కెట్‌ విలువల సమీక్షచేసి వాస్తవ విలువలను నిర్ధారణ చేయాలని చట్టంలో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం నుంచే మార్కెట్‌ విలువల సవరణ చేయకుండా నెట్టుకొస్తున్నారు. అప్పట్లో మార్కెట్‌ విలువల పెంపు ప్రతిపాదనలను కోర్టు అడ్డుకోవడంతో నిల్చిపోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడేళ్లుగా మార్కెట్‌ విలువలను సవరించలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విప్లవాత్మక అభివృద్ధి, వికేంద్రీకరణ చర్యలతో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. ప్రస్తుత భూముల విలువలను 10 నుంచి గరిష్టంగా 50 శాతం మేర పెంచాలని యోచిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ విలువలకు సమీపంగా కార్డు వ్యాల్యూగా పిలిచే అధికారిక విలువలను నిర్ధారించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సేల్‌డీడ్‌లపై స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లతోపాటు 6శాతంగా రుసుమును వసూలు చేస్తున్నారు. జీపీఏలకు 1శాతం డ్యూటీ, రూ. 2 వేల వరకు మాత్రమే ఫీజులను వసూలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో తాజాగా స్టాంపు డ్యూటీని 7.5 శాతానికి పెంచి భూముల మార్కెట్‌ విలువలను కూడా సవరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement