Tuesday, April 16, 2024

స్వార్ధ రాజకీయాల‌ కోసం గాంధీ పేరును ఉప‌యోగించుకోవ‌డం దుర్మార్గం : తలసాని

స్వార్ధ రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమ‌ని రాష్ట్ర‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలనే దురుద్దేశంతోనే నేడు ధర్నా చేపట్టడం దురదృష్టకరమ‌న్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మాగాంధీ అంటే త‌మకు ఎంతో గౌరవముంద‌న్నారు. సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల గాంధీ విగ్రహం పరిసరాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమ‌న్నారు. ప్రస్తుతమున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగిస్తారని చేస్తున్న ఆరోపణలు నిరాధారమ‌న్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జస్టిస్ అమర్నాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ లను సంప్రదించిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టామ‌న్నారు. ప్రస్తుతమున్న పార్క్ ప్రాంతాన్ని మరింత విస్తరించి రూ. 60 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాంధీ జయంతి, వర్ధంతిలకు మాత్రమే హాజరై గాంధీ పార్క్ అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నేడు గాంధీ పార్క్ అభివృద్ధి జరుగుతుంటే అక్కసుతో నిరాధార‌ విమర్శలు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement