Monday, April 15, 2024

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు వాయిదా?

హైదరాబాద్‌, : ఇంటర్‌ వార్షిక పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మే 1వ తేదీనుంచి రెండు వారాల పాటు ఈ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ అంతకంతకూ ఉధృతమవుతుండడంతో మరో 20 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ పరీక్షలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరిస్థితులను బట్టి ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేయాలన్న తలంపుతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకు నేందుకు వీలుగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు కేవలం వారి హాల్‌ టికెట్ల నెంబర్లను మాత్రమే ఇచ్చిందని పరీక్షా కేంద్రం, ఇతర వివరాలను వెల్లడించలేదని దీన్నిబట్టి చూస్తుంటే మే 1 నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు వాయిదా పడతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలో జరిగే వివిధ ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రథమ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలను నిర్వహించాలా, లేక రద్దు చేసి ఆ పై తరగతికి ప్రమోట్‌ చేయాలా అనే అంశంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజ్‌ని కలిస్తున్నందున ఖచ్చితంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించక తప్పదని అలాగే జాతీయ స్థాయిలో జరిగే నీట్‌, జేఈఈ పరీక్షలకు సైతం ఇంటర్‌ మార్కులే ప్రాతిపదిక కావడంతో వీటిని జరపాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 9.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా ఇందులో 4.5 లక్షల మంది ద్వితీయ సంవత్సరం వారు ఉన్నారని మిగతా వారంతా ఫస్టియర్‌ విద్యార్థులని ఇంటర్‌ బోర్డు చెబుతోంది. కళాశాల, గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు అధికంగా
(మొదటిపేజీ తరువాయి)
కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే రెండు వారాల్లో కరోనా మరింత విజృంభిస్తుం దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడాల్సి వస్తుందని భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ ను బట్టి మే రెండో వారంలో ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది.
కరోనాపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ పరీక్షల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరో పది రోజుల పాటు పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణ యం తీసుకోవాలని ఆయన అధికారులను కోరినట్టు సమాచారం. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు జరప కుండా విద్యార్థులందరినీ ఆ పై తరగతులకు పంపిం చాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి అందరినీ ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఇదే పరిస్థితి వచ్చినా ఆశ్చ ర్యపోనవసరం లేదని పాఠశాల విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసినట్టు ఆ అధికారి వివరించారు.
ఎంసెట్‌కు పెరుగుతున్న దరఖాస్తులు
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షకు వస్తున్న దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నాయి. నిన్నటి దాకా రోజుకు రెండు మూడు వందల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే వారని, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్‌ టికెట్‌ నెంబర్లను ప్రకటించడంతో ఈ సంఖ్య పెరుగుతోందని ప్రవేశ పరీక్ష కన్వీనర్‌, జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య గోవర్దన్‌ తెలిపారు.
ఇప్పటి దాకా 19వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని మే 16వ తేదీ వరకు గడువు ఉందని అవసరమైతే ఈ గడువును పొడిగిస్తా మని ఆయన చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎంసెట్‌ నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పరిగణలోకి తీసుకుని పరీక్షలను నిర్వహిస్తామని ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement