Tuesday, April 16, 2024

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఊరుకోం.. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కల్తీలకు పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కల్తీ ఆహారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆహార కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. కల్తీ ఆహారంతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతోపాటు జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పదర్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓ వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే… మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అంశంపై ఐపీఎం, ఫుడ్‌ సేఫ్టీ విభాగం , ప్రయోగశాలల అధికారులతో నెలవారీ సమీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు కల్తీ ఆహారం విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లోపించినట్లు సమాచారం ఉంటే 040-21111111 నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు.

ట్వీట్టర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు. కల్తీ ఆహార నిరోధానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, 2.4 కోట్లతో అధునాతన ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్‌ వాహనాలను సమకూర్చామని, ఐపీఎంలో 10కోటలతో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆరోగ్యానికి నష్టం చేసే కల్తీలపై మొబైల్‌ వాహనాల ద్వారా తనిఖీ చేయాలని, జిల్లాల్లో టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిల్వలు పెంచాలన్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు రక్తం సేకరించి అవసరమైన ఏరియా ఆసుపత్రులకు రక్తం సరఫరాను కొనసాగించాలన్నారు. తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement