Thursday, March 28, 2024

పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తలసాని

పేద, మద్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నారాయణ జోపిడి సంఘంలో 22.94 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 296 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజలు అన్ని సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఇప్పటికే పలుచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్దిదారులకు అందించడం జరిగిందని, లబ్దిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మురికి కూపాలను తలపించే బస్తీలు నేడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో కొత్తదనాన్ని సంతరించుకు న్నాయని వివరించారు. ఇండ్లు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మీ వద్దకు వస్తారని, వారిని నమ్మి మోసపోవద్దని, అర్హులైన వారందరికీ పారదర్శకంగా వ్యవహరించి ఇండ్లను కేటాయించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపడుచు వివాహానికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేష్, కలెక్టర్ శర్మన్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, డీఈ గంగాధర్, ఎమ్మార్వో బాల శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement