Saturday, April 20, 2024

తొలగిన ప్ర‌తిష్టంభ‌న‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: గడిచిన రెండేళ్ళ కాలం గా రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ వీడింది. గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశా లను ప్రారంభించేందుకు కేసీఆర్‌ సర్కారు అంగీకారం తెలి పింది. ఈ విషయాన్ని హైకోర్టు వేదికగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలు, హక్కులు, సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు, ఆనవాయితీల్లో గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్య తలెత్తిన వివాదం ఉన్నత న్యాయస్థానం జోక్యంతో దాదాపు సమసిపోయింది. హైకోర్టు సూచనలతో రాష్ట్ర బడ్జెట్‌ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. బడ్జెట్‌ను గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదించలే దంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ప్రభు త్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు- ప్రభుత్వ, అటు- రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి కూడా అంగీకరించినట్లు- ప్రభుత్వ తరఫు
న్యాయవాది దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. అలాగే, అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌ అనుమతించనున్నట్లు- రాజ్‌భవన్‌ న్యాయవాది అశోక్‌ ఆనంద్‌ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.

ఫలించిన చర్చలు
బడ్జెట్‌ సమావేశాలకు గడువు దగ్గర పడుతున్నా, గవర్నర్‌ ఆమోదం లభించలేదంటూ సోమవారం కేసీఆర్‌ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఉదయం విచారణ ప్రారంభమైన తరువాత కొద్దిసేపటికే ఈ కేసు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. ఆ సమయంలో సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ తరఫు న్యాయవాదులు దుష్యంత్‌ దవే, అశోక్‌ ఆనంద్‌లు జరిపిన చర్చలు ఫలించాయి. చర్చల్లో పరిష్కారం లభించిందని ఇరు పక్షాల న్యాయవాదులు ఆ తరువాత ఉన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి అంగీకరించినట్లు- ఇరుపక్షాల న్యాయవాదులు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్‌ అనుమతిస్తారన్నారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.

స్పందన లేకపోవడంతోనే కోర్టుకు
2023-24 బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. దానికి గవర్నర్‌ తమిళిసై సోమవారం వరకూ ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ ఏర్పడింది. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటివరకు గవర్నర్‌ ఆమోదం తెలపక పోవడంతో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

షెడ్యూల్‌లో మార్పులపై సీఎం సమీక్ష
బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ విషయమై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీ, సంబంధిత అంశాలపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌ తేదీలను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement