Thursday, April 25, 2024

ఉద్యమ సంస్థ నుంచి.. రాజకీయ పార్టీగా అభివృద్ధి సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ : త‌ల‌సాని

ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా అభివృద్ధి సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని బస్తీలు, డివిజన్ల‌లో తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 27వ తేదీన హెచ్ఐసీసీలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్లీనరీ నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు ఉంటాయని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శ పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ లు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్, నియోజకవర్గ ఇంఛార్జి లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement