Wednesday, April 17, 2024

మినీ పుర పోల్స్ ప్ర‌చారం స‌మాప్తం….పోలింగ్ ఏర్పాట్ల‌లో యంత్రాంగం..

ఆఖర్లో హోరెత్తిన ప్రచారం
స్వీప్‌ చేస్తామంటున్న టీఆర్‌ఎస్‌
ప్రజలు తమవైపే అంటున్న బీజేపీ, కాంగ్రెస్‌
ప్రచారం ముగియడంతో ప్రలోభాలపై ఫోకస్‌
నోట్ల పంపిణీకి జాబితాల తయారీలో నేతలు
పలు పురపాలికల్లో జోరుగా మద్యం పంపిణీ

హైదరాబాద్‌, : మినీ మునిసిపోల్స్‌ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. కరోనా నేపథ్యంలో 72 గంటల ముందే.. ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించగా, రాజకీయపార్టీలన్నీ ఆఖర్లో ప్రచారాన్ని హోరెత్తించాయి. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీల్లో ప్రచారం జోరుగా సాగింది. రాజకీయపార్టీలు ఓవైపు కరోనా భయపెడుతున్నా.. ఓటరు ప్రసన్నానికి రకరకాల ప్రయత్నాలు చేశాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు కార్పోరేషన్లు, ఐదు మునిసిపాలిటీలపై దృష్టి పెట్టి.. స్వీప్‌పై ధీమా వ్యక్తం చేస్తుండగా, బీజేపీ వరంగల్‌, సిద్దిపేట వంటి స్థానా లపై ఫోకస్‌ పెట్టింది. ఏడు పురపాలికల్లోనూ జోరు ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం, వరంగల్‌తో పాటు అన్నిచోట్లా శక్తి కూడగట్టుకుని పోరా డుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి ఆయా జిల్లాల మంత్రులే ఎన్నికల బాధ్యతలు చేపట్టి ప్రచారం నిర్వహించగా, బీజేపీ తరుపున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌, ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ప్ర చారం ముగియడంతో పోలి ంగ్‌ ముగిసే సమయానికి ఓటర్లను ఎలా ఆకర్షించాలనే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ఈ ప్రాంతాలే కాక పలు మునిసిపాలిటీల్లోని ఎనిమిది వార్డులతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18వ వార్డు లింగోజిగూడ డివిజన్‌లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ లో 66 వార్డులుండగా, ఖమ్మంలో 60, సిద్దిపేటలో 43 ఉన్నాయి.
నోట్లు.. మద్యం
ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల నేతలు సంఘాల వారీగా మందు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఓటర్లకు సంఘాల వారీగా, కులాల వారీగా వర్గీకరించి మందు పార్టీలు ఇచ్చిన నేతలు కరోనా తీవ్రం గా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు నేరుగా డోర్‌ డెలివరీ ప్రారంభించాయి. ఇక వార్డులవారీగా పోటీని బట్టి నోట్ల పంపిణీకి డబ్బు సిద్దం చేసుకున్నాయి. ఎవరెవరికి పంపిణీచేయాలో వార్డులవారీగా జాబితాలు రెడీ చేసుకున్నాయి.
ఆఖరి ప్రయత్నాలు
గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్లతో పాటు ఐదు మునిసిపాలిటీల్లో ఆయా పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందుకు వార్డుల వారీగా ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వారికి మద్దతుగా నిలిచిన వారెందరు, బయట ఉన్న ఓట్లెన్ని వంటి వివరాలు తెలుసుకుంటున్నారు. వారిని ఓటేసేందుకు తీసుకువచ్చేలా చూడాలని వార్డుల్లోని ముఖ్య నేతలతో పాటు సంఘాల లీడర్లకు ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. ఓటర్లకు, ప్రభావిత నేతలకు ఫోన్లు చేస్తూ మద్దతుగా నిలవమని విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఎవరిధీమా వారిదే
రాజకీయపార్టీలు మునిసిపోల్స్‌కు సంబంధించి.. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలముందున్న వాతావరణంలో.. వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్లపై కాషాయజెండా ఎగురుతుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుని ఆశలు పెట్టుకున్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయింది. రెండు కార్పోరేషన్లతో పాటు ఐదు మునిసిపాలిటీలు స్వీప్‌ చేస్తామని, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్ధితి కూడా లేదని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు వరంగల్‌తో పాటు ప్రతి పురపాలికలోనూ బలమైన ప్రభావం చూపుతామని, ప్రజలు తమవైపే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో దెబ్బతింటున్న కాంగ్రెస్‌.. ఈ సారైనా లేస్తామని ఆశపడుతోంది. లేవాలని లెక్కలు వేసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement