Thursday, April 25, 2024

ర‌క్త‌దానం చేసి… జీవితాన్ని బ‌హుమ‌తిగా ఇవ్వండి : స‌జ్జ‌నార్

ర‌క్త‌దానం చేసి.. మ‌రొక‌రికి జీవితాన్ని బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని టీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ అన్నారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఈనెల 30న బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణీకులకు రవాణా సేవలందిస్తు మరో ముందడుగు వేసి రక్తదాన శిబిర‌ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఈసంద‌ర్భంగా ఎండీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ… సిబ్బంది నుంచి అధికారుల వరకు, స్నేహితుల నుంచి కుటుంబ సభ్యుల వరకు ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇండియన్ ట్రస్టు సహకారంతో టీఎస్ ఆర్టీసీ ఈనెల 30న ఉదయం 9 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుంద‌న్నారు. అన్ని రీజియన్ల నుంచి 65 చోట్ల ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైన ఉద్యోగులందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ మహిళల కోసం రక్త సేకరణ కార్యక్రమాన్ని అన్ని డిపోలు, వర్క్ షాప్, బస్ భవన్ ల తో పాటు బస్ స్టేషన్లలో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆప‌ద‌లో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలిగే అవకాశం కేవలం రక్తదానంతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారు ఎవరైనా సంవత్సరంలో రెండు లేదా మూడు ప‌ర్యాయాలు ర‌క్త‌దానం చేయవచ్చని, ర‌క్తదానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలుంటాయని సూచించారు. రక్తదానం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయనే అపోహ‌లు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.

టీఎస్ ఆర్టీసీ రక్తదాన‌ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తలపెట్టడం పట్ల సంస్థ అధ్యక్షులు బాజిరెడ్డి గోవర్ధ‌న్ హ‌ర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరినీ చైతన్య‌ప‌రిచి ఎక్కువ మంది రక్తదానం చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిబ్బంది ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్న ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సంస్థను ఆదర్శంగా నిలపాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ (హైదరాబాద్) ప్రతినిధి మామిడి భీంరెడ్డి, ప్రహరీ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కులు వై.ర‌ఘు రామారావులను కూడా ప్రశంసించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement