Thursday, March 28, 2024

నివాస స్థ‌లాల‌ను సొంతం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంది : మంత్రి త‌ల‌సాని

ప్రస్తుతం తాము నివాసముంటున్న‌ స్థలం తమ సొంతం కావాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న అనేక మంది కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని జీహెచ్ఎంసీ క్వార్టర్స్, ప్రభుత్వ లీజు స్థలాలను ఎన్నో సంవత్సరాల నుండి నివాసముంటున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. దీంతో బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని న్యూ బోయగూడ, హైదర్ బస్తీలకు చెందిన, సుల్తాన్ షాహీ, ఆజాంపురలకు చెందిన జీహెచ్ఎంసీ క్వార్టర్స్ లబ్దిదారులు, జీరా లీజు స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న లబ్దిదారులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శాలువా, పూల బోకేలతో సన్మానించి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు లబ్దిదారులకు మంత్రి స్వీట్లు తినిపించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తమ స్థలాలను రెగ్యులరైజేషన్ చేయాలని లబ్దిదారులు అనేకమార్లు గత ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. పేద ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఎంతో పెద్ద మనసుతో నామమాత్రపు ధరకే లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించారని వివరించారు. నగరంలోని 9 ప్రాంతాల్లో నిర్మించిన జీహెచ్ఎంసీ క్వార్టర్స్ ను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వీటిలో ఇప్పటికే గోడే ఖీ ఖబర్, జంగం మెట్ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాలోని జీహెచ్ఎంసీ క్వార్టర్స్ లబ్దిదారుల వద్దకు త్వరలోనే అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని జీరా కాలనీ ప్రభుత్వ లీజు స్థలాలను కూడా ఎప్పటి నుండో అక్కడ ఉంటున్న వారికే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జీరా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు విజయ్ షా, జనరల్ సెక్రెటరీ రామకృష్ణ యాదవ్, ట్రెజరర్ రాజన్ గాంధీ, న్యూ బోయగూడ, హైదర్ బస్తీ, ఆజంపుర, సుల్తాన్ షాహీ లకు చెందిన అబ్బాస్, రజాక్, సాయి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement