Monday, May 17, 2021

క‌రోనా ఎఫెక్ట్ – హెల్త్ , డైట్ పై జ‌నం ఫోక‌స్…

కరోనాతో ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన శ్రద్ధ
వ్యాయామానికి తోడూ పండ్లు, బలమైన ఆహారం భోజనంలో ఉండేలా జాగ్రత్తలు
జీతంలో అధికభాగం పోషకాహారానికి, ఔషధాలకే ఖర్చు
కొవిడ్‌ భయంతో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

హైదరాబాద్‌, : దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని ప్రజలు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే చేతులుకాలకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటేపోలా అని ఆలోచిస్తున్నారు. భోజనంలో సరైనా పోషకాహారం తీసుకోకుండా, ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా అనవసరంగా కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో అడ్మిటై మన ప్రాణాలను రిస్కులో పెట్టి, పైగా ఆస్పత్రి యాజమాన్యాలకు లక్షల కొద్ది డబ్బులు ధారాపోయడం కంటే మన ఆరోగ్యానికి మనమే కాపాడుకుంటే పోలా అని ప్రజలు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. కరోనా భయంతో ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ చూపుతున్నారు. రోజూ మూడు పూటలు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇందుకోసం తమ నెలవారి జీతంలో 30 నుంచి 40 శాతం దీనికే కేటాయిస్తున్నారు. మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరీ రోగనిరోధక శక్తి పెరగాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటోంది. రోగనిరోధక శక్తి ఉన్నవారు వైరస్‌ బారినపడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తమ రోజూ వారి బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లో కార్పొహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌ ఇతర పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాలు, పెరుగు, గడ్లు, మాసం, ఆకు కూరలు, కాయకూరలు, చేపలు, దుంపలు, పండ్లు, బాదం, కాజు డ్రై ఫ్రూట్‌, నట్స్‌ లాంటి న్యూట్రీషన్‌ ఆహారాన్ని తీసుకునేందుకు జాగ్రత్తలు పడుతున్నారు. కరోనా సమయంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్‌లను ఎదుర్కొనే శక్తి వస్తోందని వైద్యులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారు తొందరగా జబ్బుల బారిన పడరు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారూ తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటి వారు కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతోంది. ఈనేపథ్యంలో రోజూ వారి తీసుకునే ఆహారంలో సమతుల్యమైన ఆహార పదార్థాలు ఉండేందుకు రోజూ వారి ఖర్చులో అధిక కేటాయింపులు చేస్తున్నారు. దీంతో రిటైల్‌, హోల్‌ సేల్‌ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.
ప్రజల రోజువారి జీవన విధానం ఎంతలా మారిందంటే కరోనా ముందు, కరోనా తరువాత అనేంతగా ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై శ్రద్ధ ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. దీని కోసం తమ నెల వారి జీతంలో 30 శాతం ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు. గతంలో రోజుకు ఒక్కసారి కూడా వ్యాయామం, యోగా చేయని వారు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో సమయం కల్పించుకొని మరీ రోజులో కనీసం 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం, యోగాకే కేటాయిస్తున్నారు. డైట్‌తోపాటు వేడి నేటిలో కాస్త ఉప్పు, పసుపు గార్గిల్‌ చేసుకోవడం దినచర్యలో భాగమైందంటే అతిశయోక్తి కాదు. తినే భోజనం వేడివేడిగా ఉండేలా చూసుకుంటున్నారు. తాగే నీరు కూడా గోరువెచ్చని నీరే తాగుతున్నారు. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, కొద్దిగా అలసటగా అనిపించినా.. తలనొప్పి, ఒళ్లు నొప్పులాంటి ఏ ఒక్క లక్షణం ఉన్నాగానీ గతంలో మాదిరిగా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెనువెంటనే దగ్గరలో ఉండే క్లినిక్‌కో, పీహెచ్‌సీకో, లేదా ప్రైవేట్‌ ఆస్పత్రికో పరుగులు పెడుతున్నారు. మరి కొంతమందేమో మెడికల్‌ షాపులకు వెళ్లి లక్షణాలు చెప్పి మందులు తెచ్చుకొని వాడుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ తమకు కరోనా సోకుతుందనో, కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంతలా ఆరోగ్యం, ఆహారం విషయంలో జనం జాగ్రత్తులు వహిస్తున్నారు. మన దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించక ముందు ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. కానిప్పుడు ఆరోగ్యంపై జనాలకు శ్రద్ధ పెరిగింది.
ఈ ఆహారం తీసుకుంటే మంచిది…
ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అయితే శాఖాహారమైనా, మాంసాహారమైనా ఏదైనా సమతుల్యంగా తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటున్నారు వైద్యులు. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, అన్‌శాచ్యూరేటెడ్‌ ఫ్యాట్‌ తీసుకోవాలి. చేపలు, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్‌ మితంగా తీసుకుంటే మంచిది. విటమిన్‌ సి అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి 30 నిమిషాల పాటు వ్యాయామం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News