Wednesday, April 17, 2024

పాఠ్యాంశంగా విద్యుత్ పరిరక్షణ : మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్ : పాఠ్యాంశంగా విద్యుత్ ప‌రిర‌క్ష‌ణ‌ను చేర్చే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రెడ్కో ఆధ్వర్యంలో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2022 ఘనంగా జరిగింది. విద్యుత్ పరిరక్షణకు కృషి చేసిన సంస్థలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, జెన్కో, ట్రాన్స్ సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు.. అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… విద్యుత్ పరిరక్షణను పాఠ్యాంశంగా చేర్చే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై పాఠశాల విద్యాశాఖకు లేఖ రాయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మకు సూచించిన‌ట్లు తెలిపారు. కాలుష్యం అనేది ఏ ఒక్కరి సమస్య కాదని.. మానవజాతి సమస్యగా మారిందన్నారు. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తితో తీవ్రంగా కాలుష్యం అవుతోందని.. పునరుత్పాదక ఇంధనాన్ని వాడి కాలుష్య నివారణకు కృషి చేయాలన్నారు. విద్యుత్ అవసరం ఎంత ఉందో.. దుర్వినియోగాన్ని ఆపాల్సిన అవసరం కూడా అంతే ఉందని సూచించారు. ఉద్యమంలా కృషి చేస్తే తప్పా కాలుష్యాన్ని ఆపలేమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో కాలుష్యం చాలా వరకు తగ్గిందన్నారు. ఇంధన పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అవార్డు ఇవ్వాలన్నారు. రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇంధన పరిరక్షణ, కాలుష్యనియంత్రణకు రెడ్కో తీసుకుంటున్న చర్యలను అభినందించారు.

రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంధనాన్ని డబ్బు లాగా పొదుపు చేసినప్పుడే విద్యుత్ పరిరక్షణ సాధ్యమవుతుంది.. ఇంధనాన్ని పొదుపు చేసి పర్యావరణాన్ని కాపాడకపోతే రెండు రకాల బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. కరెంటును దుర్వినియోగం చేసినందుకు విద్యుత్ బిల్లు, కాలుష్యం వల్ల రోగాలు వస్తే హస్పిటల్ లో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో స్పూర్తినిచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 268 కోట్ల మొక్కలు నాటి రికార్డు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పచ్చదనం ఉన్న ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ అవార్డు సొంతం చేసుకుందన్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ తో విద్యుత్ వినియోగం చాలావరకు తగ్గుతోందన్నారు. ECBCని మున్సిపల్ చట్టంలో చేర్చిన మొదటి రాష్ట్రం మనదేనన్నారు. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లతో చాలా విద్యుత్ ఆదా అవుతోందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కి 5 స్టార్ రేటింగ్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యుత్ పరిరక్షణ, రెన్యూయెబుల్ ఎనర్జీ పెంచడానికి రెడ్కో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. జెన్ కో ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ లేనిదే మానవ మనుగడలేదు. అన్నింటికి విద్యుత్ అవసరమే. కానీ దానిని పొదుపుగా వాడాలి. రాష్ట్రం ఏర్పడిన నాటికంటే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు అయ్యిందన్నారు. SPDCL సీఎండి రఘుమారెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్నారు. శిలాజ ఇంధనాల వాడకం పెరిగి కాలుష్య స్థాయి పెరిగిపోతోందన్నారు. ఇంధన అనవసర వినియోగం తగ్గించాలని.. భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్కో ఎండీ జానయ్య,రెడ్కో ఉద్యోగులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement