Thursday, March 28, 2024

బిడ్డకు తల్లిపాలే సంజీవని.. జీవితాంతం ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బిడ్డ విషయంలో తల్లిపాలు సంజీవని అని, తల్లిపాలు బిడ్డకు జీవితాంతం ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతమని పీడియాట్రిక్‌ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో సాధారణ ప్రసవాల బదులు సిజేరియన్‌ ఆపరేషన్లకే తల్లులు మొగ్గు చూపుతుండడంతో పుట్టిన గంట లోపు తల్లిపాలు బిడ్డకు పట్టించడం సాధ్యం కావడం లేదు. మరోవైపు తల్లిపాలకు బదులు డబ్బా పాలు, మార్కెట్‌లో దొరికే ఇతర అనుబంధ ఆహారాలే మేలన్న అపోహ తల్లులు, వారి కుటుంబ సభ్యుల్లో నెలకొంది. దీంతో ఇటీవలి కాలంలో పుడుతున్న బిడ్డలు తల్లిపాలకు దూరమవుతున్నారు. ఈ తరహా దోరణి సరికాదని, తల్లిపాలు పట్టించకపోతే బిడ్డ జీవితాంతం శారీరక, మానసిక సమస్యలతోపాటు అనేక వ్యాధులతో బాదపడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నేపథ్యంలో… తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతీ ఒక్క తల్లి, వారి కుటుంబ సభ్యులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పుట్టగానే బిడ్డకు తల్లిపాలు పట్టించడం ద్వారా పాలు తాగే సమయంలో బిడ్డ పెదవులు, దవడలకు వ్యాయామం అందుతుంది. దీంతో చిన్నారులు చెవితోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి విముక్తి పొందుతారు.

తల్లిపాలలోని ప్రత్యేక గుణాలు పిల్లలను స్థూలకాయులుగా మార్చకుండా కాపాడుతాయని అనేక పరిశోధనల్లో తేలింది. కృత్రిమ డబ్బా పాలు తాగే పిల్లలు స్థూలకాయులయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిపాలల్లో ఉబ్బసం వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు పట్టించకపోతే బిడ్డ పెద్దయ్యాక ఉబ్బసం వ్యాధిబారిన పడడంతోపాటు షుగర్‌, బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు త ల్లిపాలనే పట్టించాలి. తల్లిపాలకు మరే ప్రత్యామ్న్యాయం లేదు. ఆరు నెలల తర్వాత ఘనరూప ఆహారం ఇవ్వడం మొదలుపెట్టినా తల్లిపాలు మాత్రం ఆపకూడదని పీడియాట్రిషన్లు స్పష్టం చేస్తున్నారు. కనీసం రెండేళ్ల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టించాలని సూచిస్తున్నారు. తల్లిపాల ఆవశ్యకతపై చాలా మందిలో అవగాహన లేదు… బిడ్డ పుట్టిన మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలి

డా. నజహత్‌ అజీజ్‌, ఒబెస్ట్రిక్స్‌ గైనకాలజీ నిపుణులు, అపోలో చిల్డ్రన్‌ ఆసుపత్రులు. ఇప్పటికీ చాలా మంది తల్లులు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన లేదు. ఎలాంటి అపోహలకు గురికాకుండా బిడ్డకు తల్లి పాలను పట్టించాలి. బిడ్డకు జన్మనిచ్చిన మొదటి గంటలోపు ఇచ్చే ముర్రుపాలలో యాంటీబాడీస్‌ అధికంగా ఉంటాయి. ఇవి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు మూలం. చెప్పాలంటే మానవజాతి దీర్ఘకాలిక మనుగడ అనేది బిడ్డకు తల్లిపాలు పట్టించడంపైనే ఆధారపడి ఉంది. తల్లిపాలు తాగని పిల్లలు పెద్దయ్యాక భావోద్వేగ, అనేక మానసిక, శారీరక ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనల్లో తేలింది. తల్లిపాలు తాగే సమయంలో బిడ్డ తల్లి ఒడిలో ఉండడం మూలాన అనేక ప్రమాదకర హర్మోన్లు విడుదల కావు. పుట్టగానే బిడ్డను తల్లి వద్దే ఉంచడం మూలాన తల్లితో బిడ్డకు అనుబంధం ఏర్పడి మానసిక ఉద్వేగ స్థిరత్వం ఏర్పడడం సాధ్యమవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement