Wednesday, March 27, 2024

మాజీల‌కు బండి ‘ఘ‌ర్ వాప‌సీ’ పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పార్టీని వీడిన సైద్ధాంతిక భావాలున్న వారంతా తిరిగి పార్టీలో చేరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. చిన్న చిన్న సమస్యలతో భావోద్వేగాలకు గురై పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని కోరారు. సైద్ధాంతిక భావాలున్న వారంతా తిరిగి కాషాయం కండువా కప్పుకోవాలని అందరం కలిసి సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలనపై పోరాడుదామని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందా మన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను తప్పు చేస్తే నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుందని, తాను తీరు సరిచేసుకోక పోతే హైకమాండ్‌కైనా ఫిర్యాదు చేయొచ్చన్నారు. సమస్య లుంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని, సిద్ధాంతం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి విజయ శాంతి వచ్చి 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కలిసి పోరాడుదా మన్నా రు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని, బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో అవకాశాలు ఉండవన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కొట్లాడింది విజయశాంతి మాత్రమేనని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటిక నేత విజయశాంతి అని ప్రశంసించారు. తన యాస, భాష, జిమ్మిక్కులతో ప్రజలను కేసీఆర్‌ నమ్మించి అధికా రంలోకి వచ్చారని విమర్శించారు. కాగా… మాజీ ఎంపీ, సీనియర్‌ నటి, బీజేపీ నేత జమున మృతి బాధాకరమని బండి సంజయ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మహళలు చైతన్యంతో అన్ని రంగాలో ముందుకు రావాలని కోరుకునే వారని, ఆమె ఆలోచనా విధానం మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శన మన్నారు. జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ బిల్లు పాస్‌ అవ్వడంలో విజయశాంతిది కీలకపాత్ర: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పార్లమెంట్‌లో కేసీఆర్‌లేకపోయినా తెలంగాణ బిల్లు పాస్‌ చేయిచడంలో విజయశాంతి కీలకంగా పనిచేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 25ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయశాంతికి హృదయ పూర్వ క శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర మంతటా విజయశాంతి విస్తృతంగా పర్యటించారని చెప్పారు. తన ఎన్నికల సభలో కూడా ఆమె పాల్గొన్నారని చెప్పారు. విజయశాంతి అంటే మహిళలకు ప్రత్యేకంగా అభి మానమన్నారు. విజయశాంతి బీజేపీలోనే 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అస్థిత్వ ప్రతీక విజయశాంతి: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌
తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ కొనియాడారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో పాల్గొనేందుకే ఢిల్లిd నుంచి హైద రాబాద్‌ వచ్చానని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్‌ఎస్‌ వాడుకుని వదిలేసిందని దుయ్యబట్టారు. విజయ శాంతి మరింతగా రాజకీయాల్లో రాణించాలని, మరో పాతికేళ్లు రాజకీయాల్లోనే కొనసాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

”రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తే ఎవరూ బ్రతకరు. రైతుల భూములు కూడా లాక్కుంటాడు. మరోసారి అధికారంలోకి వస్తే ఎవరికీ పింఛన్లు ఇవ్వడు” అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన మొదటి రోజు నుంచి తనను కేసీఆర్‌ వేధించాడని, చివరకు పార్టీ నుంచి అకారణంగా సస్పెండ్‌ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్‌ను నిలదీసే అవకాశం ఉన్నా తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్‌లో పాస్‌ కావాలన్న కారణంతో నిలదీయలేదని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్‌ అయ్యే రోజున కేసీఆర్‌ సభలో 2 నిమిషాలకు మించి లేడని, తాను ఒక్కతినే బిల్లు పాస్‌ అయ్యేంత వరకు తోటి ఎంపీల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ చివరి వరకు నిలబడ్డానని చెప్పారు. తెలంగాణను బీజేపీ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం తనకుందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అంతా కలిసి పనిచేద్దామని, కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు పదవులపై ఆశ లేదని పేర్కొన్నారు. తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement