Friday, October 11, 2024

Health Profile – నెల రోజుల్లో అందరికీ హెల్త్ కార్డులు.. రేవంత్

హైదరాబాద్ – బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంత వ్యయం చేసినా కెసీఆర్ లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వ లేక పోయారని విమర్శించారు.

జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభోత్సవంలో సీఎం , మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు.

- Advertisement -

అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటే మొత్తం సాగునీటి పారుదల శాఖే ఉండదని పేర్కొన్నారు. “తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయం, నీరు. సాగునీటి పారుదల శాఖలో పని అంటే ఉద్యోగం కాదు.. ఓ భావోద్వేగం. ఇంజినీర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి” అని రేవంత్ సూచించారు.

నెల రోజుల్లో హెల్త్ కార్డులు..

ప్రజలందరికీ నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు. “ప్రతి ఒక్కరి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయబోతున్నాం. ప్రజల మెడికల్‌ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చూస్తాం. క్యాన్సర్‌తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరికీ వైద్యం అందేలా చూడటం మనందరి బాధ్యత. వైద్య ఖర్చుల్లో ఎక్కువగా టెస్టులే ఉంటున్నాయి. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మారి చికిత్స పేదలకు భారమవుతోంది. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య గుర్తింపు కార్డులు లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నాం” అని రేవంత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement