Sunday, March 24, 2024

రెండు నెలల్లో అర్హులైన వారందరికీ పింఛన్లు.. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండు నెలల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. అభయ హస్తం డబ్బులను ఈ నెలాఖరులోపు వడ్డీతో సహా ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాన్ని త్వరలోనే అందిస్తామన్నారు. ఈ మేరకు వికారాబాద్‌ , కొడంగల్‌ నియోజకవర్గాల్లో గురువారం ఆయన పర్యటించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో సీహెచ్‌సీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ…. పాలమూరు-రంగారెడ్డి నీటిని కొడంగల్‌కు తరలించేందుకు కాలువ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పాలమూరు నీళ్లతో కొడంగల్‌ ప్రజల పాదాలను కడుగుతామని ప్రకటించారు. మూడు పల్లె దవాఖానాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం విభాగాన్ని కొడంగల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రూప్‌-4 ఉద్యోగాలకు జూన్‌ నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపారు. ఈ నెలలోనే 9200 గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా నోటిఫికేషన్లను ఒకదాని తర్వాత మరొకటి విడుదల చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ .. ఢిల్లిస్థాయిలో పోరాడి 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారని అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో 33శాతం మహిళలకు రిజర్వేషన్‌లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఇటీవల సివిల్స్‌ లో ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేగా కొడంగల్‌ నియోజకవర్గానికి రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ముందు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతు డిక్లరేషన్‌ చేశాక… తెలంగాణలో ప్రకటించాలని రేవంత్‌రెడ్డికి హితవు చెప్పారు. నియోజకవర్గానికి మూడువేల ఇళ్ల చొప్పున డబుల్‌ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలలు మంజూరుచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో అగ్రగామిగా తెలంగాణ ఉన్నా… ఎఫ్‌ఆర్‌బీఎం రాకుండా అడ్డుకుంటోందని, ఎంఎన్‌ఆర్జీసీ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement