Friday, June 9, 2023

రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌ను ప్రేరేపిస్తున్న ప్ర‌భుత్వాలు : వేముల శ్రీనివాస్ రెడ్డి

యాసంగిలో వరి పంట వేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని కాంగ్రెస్ కిసాన్ మోర్చా నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి అన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తకోట పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కిసాన్ మోర్చ వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… దాదాపు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం వరి కొనుగోలు చేయమని చెప్పలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి యాసంగిలో వరి కొనుగోలు చేయమని చెప్పడం సరికాదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్యం ధరలు పెంచడం, మద్యం దుకాణాలను పెంచడమే సరిపోయిందని, అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నీరుగారుస్తోందన్నారు. తెరాస ప్రభుత్వానికి మద్యం ధరల మీద, మద్యం దుకాణాలపై ఉన్న శ్రద్ధ ధ్యాస రైతుల మీద, రైతు పండించే పంటల మీద లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంతవరకు వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం టిఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. యాసంగిలో రైతులు వరి పంట పండించొద్ద‌ని చెప్పడానికి మీరెవరని, నచ్చిన పంట పండించుకునే స్వేచ్ఛ కూడా రైతుకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరి కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో క్వింటాలుకు ఏ గ్రేడ్ ధర రూ.1960 గానూ, దళారులు 13 నుంచి 14 వందల వరకు కొనుగోలు చేస్తున్నారని దీంతో క్వింటాలుకు 660 రూపాయలు రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొల్ల బాబు, మాజీ సర్పంచ్ ధన్వాడ బాలస్వామి, బిచుపల్లి, శివరాములు, సంధ వెంకటేష్, రాములు యాదవ్, ఎరుకలి శ్యామ్, ఇమ్రాన్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement