Thursday, March 28, 2024

పెండింగ్‌ చలాన్లు ఉన్నవారికి త్వరలో గుడ్‌ న్యూస్‌, ఫైన్​ భారం కాకుండా రాయితీకి ఏర్పాట్లు..

ట్రాఫిక్ రూల్స్​ పాటించకుండా ఇ-చలాన్లు అందుకుంటూ, ఆర్థిక సమస్యలతో వాటిని కట్టకుండా పెండింగ్‌లో పెట్టిన వాహనదారులకు హైదరాబాద్‌ పోలీసులు గుడ్ న్యూస్‌ చెప్పనున్నారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా రాయితీలు ప్రకటించనున్నారు. రెండేళ్లుగా కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు ఉపశమనం కలిగిస్తూ పెండింగ్‌ చలాన్లలో రాయితీని ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీసులు నిర్ణయించుకున్నారు. రాయితీ మొత్తం, తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, పెండింగ్‌ చలాన్లపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, ఇతర ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. చలానాల్లో రాయితీ ఇవ్వడం ద్వారా వాహనదారులు జరిమానాలు చెల్లించే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇకపై రాత్రి వేళల్లోనూ ట్రాఫిక్‌ పోలీసుల విధులు..
ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి 10 గంటల వరకే విధుల్లో ఉంటున్నారు. ఈనేపథ్యంలో నగరంలో రాత్రి పూటనే ఎక్కువగా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకూ ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక షిఫ్ట్‌ను అమలు చేయనున్నారు. రాత్రి వేళ ప్రమాదాలు అధికంగా నమోదువుతోన్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌, ట్యాంక్‌ బండ్‌, మలక్‌ పేట, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, బోయినపల్లి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. కాగా, రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు జరిమానాలు విధిస్తున్నామని ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. మోటార్‌ వాహన సవరణ చట్టం ప్రకారం మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడితే రూ. 10 వేల వరకు ఫైన్​ విధిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement