Thursday, April 18, 2024

సిద్ధిపేటలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లాలో వాగులు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోహెడ మండలంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 138.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో, కోహెడ మండలంలోని మోయ తుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. బస్వాపూర్ వంతెన పైనుండి మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో హనుమకొండ- సిద్దిపేటకు రాకపోకలు స్తంభించాయి. ఎగువన ఉన్న నంగునూరు మండలంలో కూడా రికార్డు స్థాయిలో 146.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎగువ నుండి వస్తున్న భారీ వరద నీటితో మోయ తుమ్మెద వాగు ఉగ్రరూపం దాల్చింది. కోహెడ మండలం లోని శనిగరం ప్రాజెక్ట్ నిండుకుండలా మరి ప్రమాదకరంగా మత్తడి పోస్తోంది. ప్రాజెక్టు ఎగువ నుండి మోయ తుమ్మెద వాగు ప్రవాహం ఉధృతంగా ప్రాజెక్టులో చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద మత్తడి ప్రమాదకరంగా పారుతోంది. ఈ నీటి ప్రవాహం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లోకి ప్రవహిస్తోంది. శనిగరం ప్రాజెక్ట్ మత్తడి శిథిలావస్థలో ఉండడంతో నీటి ప్రవాహానికి మరింత శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోయ తుమ్మెద వాగు పరిసర ప్రాంతాల ప్రజలు, శనిగరం ప్రాజెక్టు మత్తడి ప్రవాహానికి పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మత్తడి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement