Thursday, April 25, 2024

మొద‌టి స‌మీకృత మార్కెట్ శుభప‌రిణామం : స‌బితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సమీకృత మార్కెట్ నిర్మాణానికి అమన్ గల్ లో శంకుస్థాపన చేయటం శుభ పరిణామమ‌ని రాష్ట్ర మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమనగల్ పట్టణంలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. కోటి రూపాయలతో నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.4.50 కోట్ల తో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన, వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు సబితా రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ వాణిదేవి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రుల‌కు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమనగ‌ల్ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. రోడ్ల పక్కన తినే వస్తువులు, కూరగాయలు, లేకుండా అన్ని ఒకే చోట ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్, సమీకృత మార్కెట్ల‌ ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. గజ్వెల్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీలో నాలుగున్నర కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించటానికి నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి పట్టణ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు, రైతులకు అండగా ఉంటామ‌న్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో అధికంగా వరి ధాన్యాన్ని గతం వరకు పండించిన పంజాబ్ ను కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అధిగమించిందన్నారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించింది అంటే అందుకు ఏడేళ్ల కాలంలో ప్రభుత్వం రైతన్నల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలే ప్రధాన కారణమ‌న్నారు. వరి కొనుగోలు కు కేంద్రం ఆంక్షలు పెడుతుందన్నారు. యాసంగిలో పండే బాయిల్డ్ రైస్ ను కొనమని కేంద్రం అంటుందన్నారు. రైతుల కోసం పంట పెట్టుబడి సహాయంగా రైతు బంధు ఇచ్చి, ఉచిత విద్యుత్ 24 గంటలు ఇచ్చి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ, పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పక్షపాతిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రపంచంలోనే 45 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ప్రాజెక్ట్ ల మీద కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డు పడుతున్నారన్నారు. నదులను, వాటిలో నీటి వాటాలను తేల్చని కేంద్రం నేడు మాట్లాడటం హాస్యాస్పదమ‌న్నారు. పుట్టుక నుండి చావు దాకా బాధ్య‌త‌ తీసుకునే ఏకైక ప్రభుత్వం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. రెండు జాతీయ పార్టీలు ఏకమై కేసీఆర్ ఒక్కరిని విమర్శిస్తే ఇక నుండి ఊరుకోబోమ‌న్నారు.

- Advertisement -

అనంత‌రం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 13 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామ‌న్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి ల‌ సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement