Friday, November 8, 2024

Farm House Case – రెండు రోజుల‌లో విచార‌ణ‌కు హాజ‌రుకండి – రాజ్ పాకాల‌కు హైకోర్టు ఆదేశం

హైద‌రాబాద్ – పోలీసుల నోటీసుల నేపథ్యంలో రాజ్‌ పాకాల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసుల ఎదుట హాజయ్యేందుకు ఆయనకు రెండు రోజుల సమయం ఇచ్చింది. రాజ్‌ పాకాల తరఫున మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారన్నారు. ఆయన సంస్థలో పని చేసే ఉద్యోగికి డ్రగ్స్‌ పాజిటివ్‌ వస్తే రాజ్‌ పాకాలను నిందితుడిగా చేర్చారని కోర్టుకు వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని, ఇవాళ ఉదయం 9.30కి నోటీసులు ఇచ్చి.. 11 గంటలకు విచారణకు రమ్మన్నారని కోర్టుకు తెలిపారు.

పోలీసుల తరఫున అదనపు ఏజీ ఇమ్రాన్‌ ఖాన్‌ వాదనలు వినిపించారు. అరెస్టు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతోపాటు విజయ్‌ మద్దూరి అనే వ్యక్తికి డ్రగ్స్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారమే రాజ్‌ పాకాలకు 41ఏ నోటీసులు ఇచ్చామని వివరించారు. దర్యాప్తులో తీవ్ర నిర్ణయాలేమీ తీసుకోబోమని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు పిటిషనర్‌కు రెండు రోజుల గడువు ఇచ్చింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement