Friday, October 4, 2024

Exclusive On HYDRAA – హ‌ద్దుల‌న్నీ చెరిపేశారు! .. అయితే ఆపేస్తామా?

కోర్ సిటీతోపాటు శివార్ల‌లోని చెరువుల సంరక్షణ
45 ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాల సేక‌ర‌ణ‌లో హైడ్రా
చెరువుల రక్షణలో రాజీపడబోమ‌న్న రంగ‌నాథ్‌
పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్న హైడ్రా చీఫ్‌
ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన 56 చెరువుల మ్యాపులు రెడీ
శాటిలైట్ చిత్రాల కోసం హైడ్రా-ఎన్ఆర్ఎస్సీ మ‌ధ్య ఒప్పందం
ఆక్ర‌మ‌ణ‌ల ప్రాంతంలో బ‌డా నిర్మాణాల‌పై సీరియ‌స్‌
త్వ‌ర‌లోనే బ్యాంక్ మేనేజ‌ర్ల‌తో భేటీ కానున్న రంగ‌నాథ్‌
అక్ర‌మ భ‌వ‌నాల నిర్మాణాల‌కు రుణం ఇవ్వొద్ద‌ని సూచ‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:
హైద‌రాబాద్‌, చుట్టుప‌క్క‌ల ఉన్న చెరువుల‌ విషయంలో హద్దులు మార్చి, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ సాయం తీసుకోబోతున్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌) నుంచి 45 ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. హైడ్రా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది.

- Advertisement -

హ‌ద్దులు చెరిపేసిన ఆధారాల సేక‌ర‌ణ‌..
సరైన ఆధారాలతో కూల్చివేతలు చేపట్టినప్పుడే పనులు లక్ష్యం ప్రకారం కొనసాగుతాయని హైడ్రా భావిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కమిషనర్‌ రంగనాథ్‌ బాలానగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ కేంద్రాన్ని సందర్శించారు. శాస్త్రవేత్తలతో హైడ్రా కార్యక్రమాలను పంచుకున్నారు. చెరువుల రక్షణకు సాయం కావాలని అడిగారు. అధికారికంగా చెరువుల హద్దులను నిర్ణయించి, స్పష్టమైన పటాలను ఇవ్వాలని కోరారు. ”కొందరు అధికారులు ఎఫ్‌టీఎల్‌ హద్దులను మార్చినట్లు తెలుస్తోంది. అలాంటి సందర్భాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌సీ పటాలు ఉపయోగపడతాయి. అధికారికంగా వాటిని కొనుగోలు చేస్తామని, త్వరగా ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలను కోరాం” అని రంగనాథ్‌ వివరించారు.

56 చెరువుల మ్యాపులు రెడీ..
ఎన్‌ఆర్‌ఎస్‌సీ సంస్థ ఇప్పటికే హైడ్రా అభ్యర్థన మేరకు 56 చెరువుల మ్యాపుల‌ను అందజేసింది. 1979-2023 ఏళ్ల మధ్య చెరువులు ఏ విధంగా ఆక్రమణకు గురయ్యాయో చిత్రాలతో సహా వివరించింది. అనేక తటాకాలు కొన్ని రోజుల్లో కనుమరుగవుతాయని చెప్పడమే వాటి ఉద్దేశం. ఆయా పటాలను మరింత పక్కాగా రూపొందించి, హద్దులను నిర్ణయించాలని తాజాగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశోధన సంస్థను కోరారు.

వారికి రుణాలు ఇవ్వొద్దు..
భ‌వ‌న నిర్మాణాల విష‌యంపై హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, FTL జోన్లల్లో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయనుంది. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలను హైడ్రా ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన లీగల్ టీం కూడా ఏర్పాటు అయిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చెరువుల్లో నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement