Friday, April 26, 2024

ఇంకా ఖరారు కాని ఇంజనీరింగ్‌ ఫీజులు.. ఈ ఏడాదికి పాత ఫీజులే అమలు చేయాలని సిఫార్సు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఒకవైపు ఈ విద్యా సంవత్సరానికి ఇంకా ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులు ఖరారు కాలేదు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచే ప్రారంభం కావాల్సిన వెబ్‌ ఆధారిత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సాయంత్రం వరకు ప్రారంభమేకాలేదు. ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్‌, కాలేజీల గుర్తింపు, ఫీజుల ఖరారు ప్రక్రియ గందరగోళంగా మారడంతో విద్యార్థులు మరింత ఆయోమయోయానికి గురవుతున్నారు. దీనికి తోడు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమై రిజిస్ట్రషన్‌, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగుతున్నా ఇంజనీరింగ్‌ ఫీజులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా ఉండేందుకు ఈ విద్యా సంవత్సరం (2022-23) పాత ఫీజునే వసూలు చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించింది. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈఏడు పాత ఫీజులా? లేక కొత్త ఫీజులా? అనేదానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా జీవో జారీ చేయాల్సి ఉంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనా ఫీజుల విషయంపై సందిగ్ధత నెలకొనేఉంది. 2019లో నిర్ణయించిన ఫీజు గడువ ఈ ఏడాదితో ముగియడంతో వచ్చే 2022-25 మూడేళ్లకు కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇంజనీరింగ్‌ కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ జూలై 20 వరకు భేటీ అయి వారి అభిప్రాయాలను విని ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేసింది. ఈక్రమంలోనే కనీస ఫీజును రూ.45 వేలుగా, గరిష్ట ఫీజును 1.73 లక్షలుగా టీఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. ప్రస్తుతం రూ.35వేలుగా ఉన్న కనీస ఫీజును ఈ విద్యాసంవత్సరం నుంచి రూ.45వేలుగా, రూ.1.34లక్షలుగా ఉన్న గరిష్ట ఫీజును 1.73 లక్షలుగా ఖరారు చేసింది. అయితే ఈ కొత్త ఫీజులు ఈఏడాదికి అమల్లోకి రావని, పాత ఫీజులనే అమలు చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ ఆదేశించింది. దీనిపై ఈమేరకు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక కూడా పంపింది. ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఫీజులను అమలు చేయనున్నారు.

14 కాలేజీలకు కొత్త ఫీజులే!
ఈ ఏడాదికి కొత్త ఫీజులనే అమలు చేయాలని దాదాపు 14 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దాంతో ప్రస్తుతం వాటిల్లో కొత్త ఫీజులకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే పాత ఫీజులు అమల్లోకి వస్తే పెంచిన ఫీజులను తిరిగి ఇవ్వవలసి ఉంటుందనే నిబంధనను కోర్టు పెట్టినట్లుగా తెలిసింది. మిగతా కాలేజీల్లో పాత ఫీజులే ఉండే అవకాశం ఉంది.

పూర్తి కాని అఫిలియేషన్‌…
దాదాపు 145 ఇంజనీరింగ్‌ కాలేజీల ఇన్‌స్పెక్షన్‌ ప్రక్రియను ఎట్టకేలకు జేఎన్‌టీయూహెచ్‌ సోమవారమే పూర్తిచేసింది. అఫిలియేషన్‌ ఉత్తర్వులు వెలువడడానికి ఇంకా రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది. అఫిలియేషన్‌, ఫీజుల ఖరారుపై ఉత్తర్వులు వెలువడితే కాని విద్యార్థులు సరిగా వెబ్‌ఆప్షన్‌ ఇచ్చుకోలేని పరిస్థితి. ఏ కాలేజీకు గుర్తింపు ఉంది? ఏ కాలేజీలో ఫీజు ఎంత ఉందనేది వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలకు ఆప్షన్‌ ఇచ్చుకునే వీలుంటుంది. అలా కాకుండా ఏ కాలేజీకు గుర్తింపు ఉందో, ఫీజు ఎంత ఉందో తెలియకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. రాత్రి ఆరేడు గంటల ప్రాంతంలో వెబ్‌ఆప్షన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 30 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు 8409 మంది సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 51,488 మంది ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement