Thursday, April 25, 2024

తెలంగాణలో క్రీడలకు ప్రోత్సాహం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న క్రీడాకారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రామీణ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే క్రీడాకారులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గ్రామీణ క్రీడ లు, క్రీడాకారులను ప్రోత్సహించడాన్ని ప్రభుత్వం ఒక విధానంగా పెట్టుకుంది. కేవలం ఒక చోట శిక్షణ ఇచ్చే మూస పద్ధతిని పక్కనబెట్టి.. ప్రతి మేజర్‌ గ్రామ పంచాయతీలో ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసే బృహత్తర కార్యక్రమానికి పల్లె ప్రగతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ప్రతి మండల కేంద్రం, ప్రతి మేజర్‌ గ్రామ పంచాయతీలో కనీసం ఒక ఎకరా స్థలానికి తగ్గకుండా సేకరించి, అందులో క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరిచారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో, నగర ప్రాంతాల్లోని డివిజన్లలో కనీసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రీడా ప్రాంగణాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, లాంగ్‌ జంప్‌ పిట్‌, ఎక్సర్‌ సైజ్‌ బార్‌ వంటి క్రీడా సాధనాలను సమకూరుస్తున్నారు.

ఆటలు కేవలం దేహ దారుఢ్యానికే కాకుండా, ఆరోగ్యం, మానసికోల్లాసానికి కూడా దోహదపడతాయి. ఒకప్పుడు పాఠశాలల్లో ప్రతి రోజూ ఒక ఆటల పీరియడ్‌ ఉండేది. ఓ క్రాప్ట్ టీచర్‌ ఉండేవారు. ఏ టీచర్‌ రాకపోయినా, ఆ పీరియడ్‌ ఆటలకే అంకితమయ్యేది. ఆటలు అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. అంతేనా! స్కూల్‌ చుట్టీ బెల్‌ కొట్టారంటే చాలు పుస్తకాలు గ్రౌండ్‌ లోనే ఓ మూలన పడేసి చీకటి పడేదాకా నచ్చిన ఆటలు ఇష్టానుసారంగా ఆడుకునేవాళ్ళం అని చాలా మంది తమ పిల్లలకు చెప్తుంటారు. గ్రామాల్లోని యువకులు, ఔత్సాహక క్రీడాకారులనేకమంది, టీచర్స్‌, పోలీస్‌… ఇలా అనేక వర్గాల వాళ్ళు వచ్చి అదే గ్రౌండ్‌లో ఆడే ఆట పాటలతో ఎల్లప్పుడూ సందడిగా కనిపించేది. విద్యార్థులు పొద్దున్నే గ్రౌండ్‌ కి వెళ్ళి పి.ఇ.టి. సార్‌ ఇచ్చే శిక్షణ, వామప్‌ వ్యాయామాలు చేసేవారు.

విద్యార్థులకు క్రీడల్లో చిన్నప్పటి నుండే శిక్షణ అందిస్తే గొప్ప విజయాలను సాధిస్తారని పలు సందర్భాల్లో నిరూపితమైంది. మహబూబాబాద్‌ జిల్లాలోని ఇనుగుర్తి లాంటి గ్రామంలో ఓ పీఈటి ఉపాధ్యాయుడు ఇచ్చిన శిక్షణ వెంకటనారాయణ లాంటి అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులనే తయారు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 19,472 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 13,418 ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయనున్నారు. వీటిలో 10,451 గ్రామ పంచాయతీల్లో 2,967 ఆవాసాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 5,602 ప్రాంగణాల పనులు పూర్తయ్యాయి. ఇంకా 7,787 వాటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు, యువకులు ఆరోగ్యంగా, హాయిగా ఉండేందుకు వీలుగా ఈ క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడాలని సిఎం కెసిఆర్‌ ఆలోచిస్తున్నారు. సరిగ్గా ఈ ఫలితాలు సాధించేందుకు క్రీడా ప్రాంగణాలు దోహదం చేయాలని, జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ క్రీడాకారులు మన రాష్ట్రం నుంచి రాణించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement