Tuesday, April 16, 2024

దళితులకు మరింత లబ్ది, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎస్సీల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్న ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఇప్పటికే దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే మహదాశయంతో ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో చిట్టచివరి అంతిమ లబ్దిదారు వరకు ప్రతీ ఒక్కరికి ఏదోఒక పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా సరికొత్త విధానంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను అందించే దిశగా కార్యాచరణ చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్‌ పార్కులకు 1059 ఎకరాలను సమీకరించాలని టీఎస్‌ఐఐసీ తీర్మానించింది. అనేక కీలక అంశాలతో టీఎస్‌ఐఐసీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు అందించడం ప్రధానాంశంగా నివేదించింది.

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని రాయితీలను కల్పించాలని టీఎస్‌ఐఐసీ తీర్మానించింది. అదనపు రాయితీల ద్వారా ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఆర్ధిక స్వావలంభన సాధిస్తారని ప్రభుత్వ యోచనగా ఉంది. గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను కూడా అమలు పర్చేందుకు సన్నద్ధమవుతోంది. పరిశ్రమలకు కేటాయించిన భూములకు ఆయా వర్గాలకు 33.1 శాతం రిబేటును వర్తింపజేస్తున్నారు. ఇకపై దీనిని 50శాతానికి పెంచాలని నిర్ణయించారు. మిగతా భూమికి చెల్లించాల్సిన మొత్తాన్ని 8 వార్షిక వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటును వర్తింపజేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. వాయిదా చెల్లింపు మొత్తాలపై ఉన్న 18శాతం వడ్డీని 4శాతానికి తగ్గించేలాని సిఫార్సు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లీజుపై కేటాయించే భూముల గడువును 10ఏళ్లనుంచి 33 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా భూములను తనఖా పెట్టి రుణం తీసుకునేలా ముందుగానే సదరు భూములను సేల్‌ డీడ్‌ చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయా వర్గాలకు కేటాయించిన భూముల మొత్తం విలువను చెల్లించి లీజు డీడ్‌నుండి సేల్‌ డీడ్‌కు మార్చుకునే వెసులుబాటుకు ఆమోదం తెలిపారు.

పారిశ్రామిక వాడల ఏర్పాటుకు 1059 ఎకరాల సేకరణ…

రాష్ట్రంలో పారిశ్రామిక వాడల ఏర్పాటు, విస్తరణకు 1059.31 ఎకరాల భూములు అవసరమని టీఎస్‌ఐఐసీ గుర్తించింది. ఈ భూములను సేకరించి టీఎస్‌ఐఐసీ పేరిట అలినేషన్‌ చేసేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ జాబితాలో రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లో 82 ఎకరాలు, హిమాయత్‌సాగర్‌లో వాలంతరికీ చెందిన 49.34 ఎకరాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్‌ పార్కులు ప్రతిపాదించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురంలో ఇండస్ట్రియల్‌ పార్కుకు 608 ఎకరాలలో. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 53 ఎకరాలలో జోరుగా నిర్ధేశిత పనులు నడుస్తున్నాయి. రామచంద్రాపురం వెల్మల గ్రామంలో 53ఎకరాలలో రైల్వే కోచ్‌ల తయారీ ఫ్యాక్టరికీ ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో ఇండస్ట్రీయల్‌ పార్కుకు 1.9 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో లెథర్‌ పార్కుకు 14 ఎకరాలు, సిద్దిపేట జిల్లా ములుగులో ఆటోమోటివ్‌ పార్కు విస్తరణకు 127 ఎకరాలు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట్‌లో ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు 46 ఎకరాలు, కాకతీయ మెగా టక్స్‌టైల్‌ పార్కుకు వరంగల్‌ జిల్లాలో 25 ఎకరాలలో పనులుపురోగతిలో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement