Monday, December 2, 2024

Dilavalpur – ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌కు అనుమ‌తిచ్చింది కెసిఆరే – అప్పటి జీవోల‌ను విడుద‌ల చేసిన రేవంత్ సర్కార్

కేంద్రం అనుమ‌తిచ్చింది ఫ్యూయల్ ఇథనాల్ ప‌రిశ్ర‌మ‌కు
దానిని అడ్డం పెట్టుకుని ఇత‌ర ఉత్ప‌త్పుల‌కు టి పాస్ ద్వారా అనుమ‌తి
ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌, ఎన్‌వోసీ తీసుకోకుండానే కెసిఆర్ మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్
అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని తప్పుదోవ ప‌ట్టించిన పీఎంకే కంపెనీ
అడ్డ‌గోలు అనుమ‌తుల‌పై విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశం

హైద‌రాబాద్ – నిర్మల్ జిల్లా దిలావల్పూర్ ఇథనాల్ ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు అనుమ‌తులిచ్చింది కెసిఆర్ ప్ర‌భుత్వ‌మేన‌ని తేల్చి చెప్పింది ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు అప్ప‌డు విడుద‌ల చేసిన జీవోల‌ను నేడు మీడియాకు అంద‌జేసింది. 2023, డిసెంబర్ 7కు ముందే టీఎస్-ఐపాస్ ద్వారా ఆ కంపెనీకి అనుమతులు జారీ అయినట్లు సర్కార్ పేర్కొంది. పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింద‌ని, అయితే దానిని ఆధారం చేసుకుని ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు అప్పటి కెసిఆర్ మంత్రివర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని వెల్ల‌డించింది రేవంత్ స‌ర్కార్ .

అడ్డగోలు అనుమతులు

- Advertisement -

కేసీఆర్ ప్రభుత్వం పీఎంకే కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీ చేసిందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఇథనాల్ కంపనీ అడ్డదారులు తొక్కినట్లు గుర్తించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి ఎన్‌వోసీ తీసుకోవడం తప్పనిసరి. ఎన్‌వోసీ తీసుకోకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అప్పట్లోనే నిర్మాణాల‌ను ప్రారంభించిన‌ట్లు గుర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోనే పర్యావరణ అనుమతుల నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందనేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఆరోపిస్తున్న‌ది.

కేబినెట్ అనుమతి లేకుండానే…

2022, అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి లెటర్ ఆఫ్ ఇండెంట్ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం కేబినేట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. 2022 డిసెంబర్‌లో ఆ నిర్ణయాన్ని కేసీఆర్ కేబినెట్ ర్యాటిఫై చేసింది. ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వంతో పాటు పర్యావరణ అనుమతి తప్పనిసరి. ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ / ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి పీఎంకే డిస్టిలెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది.. కానీ కేంద్ర పర్యావరణ శాఖకు మాత్రం”ఫ్యూయల్ ఎథనాల్” కోసమే దరఖాస్తు చేసినట్లు విచారణలో బయటపడింది. అక్కడ ప్రతిపాదించిన 300 కేఎన్‌పీడీ సామర్థ్యం మొత్తం “ఫ్యూయల్ ఇథనాల్” తయారీకేనని కంపెనీ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించింది. కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని.. ప్రజాభిప్రాయ సేకరణ నుంచి అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 24 కేంద్ర పర్యావరణ శాఖ కేవలం ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఫ్యూయల్ ఇథనాల్‌‌కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసింది.

నిబంధనల ఉల్లంఘన..

కొత్త లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను చూపించి 2023 జూన్ 7న ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు పీఎంకే కంపెనీ దరఖాస్తు చేసుకుంది. పర్యావరణ శాఖ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (NoC) తీసుకోవటం తప్పనిసరి. కానీ పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించేసింది. దీంతో పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించింది సదరు కంపెనీ. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 2023 జూన్ 15న ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు రేవంత్ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement