Friday, April 26, 2024

ధరణితో దడదడ, మ్యూటేష‌న్ల‌లో ఆల‌స్యం.. రైతుల్లో అస‌హ‌నం..

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : వ్యవసాయ భూముల రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు వాటి నిర్వహణ నిమిత్తం ప్రభుతం మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆతరువాత ధరణి విధానాన్ని అమల్లోకి తీసుకవచ్చింది. 2020 అక్టోబర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌ పోర్టల్‌ను అమలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను మండల తహసీల్దా ర్లకు అప్పగించారు. మీసేవ ద్వారా వ్యవసాయ భూములను విక్రయించే వారు స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తే అక్కడ మండల తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ అయిన కొద్ది క్షణాల్లోనే రెవెన్యూ రికార్డులలో పేరు మార్పిడి కూడా జరిగిపోతుంది. అక్కడే కొత్త పాస్‌ పుస్తకం ప్రింట్‌ను కూడా కొనుగోలు దారులకు అందజేస్తారు. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన వారం రోజులలో ఇంటికి కొత్త పాస్‌ పుస్తకం పోస్ట్‌లో వస్తుంది. ధరణి పనితీరులో ఎలాంటి సమస్య లేదు. ఈ విధానంతో వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన తరువాత ముటేషన్‌కు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ తరువాత పాస్‌ పుస్తకాల కొరకు మరికొంత కాలం అధికారుల చుట్టూ తిరగాల్సివచ్చేది. ఇందుకు రెవెన్యూ అధికారులు.. సిబ్బందికి భారీగా మా మూళ్లు ఇచ్చుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ బాధలన్ని దూరం అయ్యాయి. అయితే ధరణిలో వ్యవసాయ భూముల వివరాల నమోదు సమయంలో భారీగా తప్పులు జరిగాయి. అప్పటి వరకు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులకు భూమి లేనట్లు నమోదైంది. ఒక రైతులకు తక్కువ విస్తీర్ణం నమోదు కాగా మరికొందరికి ఎక్కువ భూమి ఉన్నట్లు నమోదు చేశారు.

ఒక సరే నెంబర్‌లో ఉన్న భూమి కంటే ఎక్కువ మొత్తం ఉన్నట్లు నమోదు చేసి పాస్‌ పుస్తకాలను జారీ చేశారు. ప్రభుత్వ భూములకు సంబంధించి గతంలో ఎవరికి అసైన్డ్‌ చేయకపోయినా ధరణిలో భూవివరాల నమోదు సమయంలో పెద్దఎత్తున అసైన్డ్‌ చేసినట్లు పేర్లను నమోదు చేశారు. గతంలో రెండు లేదా మూడు సర్వే నెం బర్లలో భూమి ఉన్నట్లు ప్రభుతం పాస్‌ పుస్తకాలను జారీ చేసింది. ధరణి వచ్చిన తరువాత వాటిలో కొన్ని సరే నెంబర్లలో ఉన్న భూమి కనిపించడం లేదు. ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి పై కేసు ఉంటే అట్టి సర్వే నెంబర్‌లో ఉన్న మొత్తం భూమిని నిషేధిత జాబితా లో ఉంచారు. ధరణికి ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి నేటికీ ముటెషన్‌ సమస్యలు ఎదురవు తున్నాయి. గతంలో ప్రభుత్వ అవసరా లకు రైతుల నుంచి భూములను ప్రభుతం సేకరించింది. అలాంటి వాటికి తిరిగి పాస్‌ పుస్తకాలను జారీ చేసి ధరణిలో నమోదు చేశారు. చాలా సరే నెంబర్ల వివరాలు గతంలో రెవెన్యూ రికార్డులలో ఉండగా ప్రస్తుతం ధరణిలో కనిపించడం లేదు. మాజీ సైనిక ఉద్యో గులు, స్వాతంత్య్ర సమరయోధులకు గతంలో ప్రభుతం 5 ఎకరాల వరకు ప్రభుత భూమిని అసైన్డ్‌ చేసింది. పదేళ్ల తరువాత వాటిని విక్రయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం అట్టి భూములన్నింటిని నిషేధిత జాబితాలో పెట్టారు. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూసేందుకు ధరణిలో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తోంది. ఇటీవల కూడా కొన్ని సమస్యల పరిష్కారానికి కొత్తగా మోడ్యూల్స్‌ను పొందుపరిచారు.

అయితే ధరణిలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు వాటి పరిష్కారం నిమిత్తం గత ఏడాది కాలంగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమనారం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో నిర్వహించే ప్రజావాణికి వందల సంఖ్యలో ధరణి సమస్యలు వస్తున్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పరిమితంగానే అధికారాలు కట్టబెట్టింది. దీంతో రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ధరణిపై అన్ని పార్టీలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో ధరణిని రద్దు చేస్తామని ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరు రాజకీయ నేతలు.. భూ మాఫియా చేతిలో ఉన్న వందల ఎకరాల భూములకు హక్కులు లేకపోవడంతో ధరణిలో అలాంటి భూముల వివరాలు లేకపోవడంతో ధరణిని తప్పించాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకవస్తున్నారు. అయితే ధరణి విధానాన్ని కొనసాగిస్తూనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి పరిష్కరిస్తే సరిపోతుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement