Friday, April 19, 2024

సైబర్ నేరాలు పెరిగాయి… సాధారణ నేరాలు తాగ్గాయి – డీజీపీ

హైదరాబాద్ – రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్‌లపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, రేంజ్ ఐజీలు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురైన వారు అందించే ప్రతీ ఫిర్యాదుపై కేసును నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేరాల నమోదు నిర్దారిత ప్రమాణాలలోనే ఉన్నాయని, వ్యక్తిగత నేరాల మినహా మిగిలిన నేరాలన్నింటిలోనూ తగ్గుదల ఉందని తెలిపారు.

డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ చేసిన సమీక్ష అనుసరించి రాష్ట్రంలోని మొత్తం 700 పోలీస్ స్టేషన్లలో 330 పోలీస్ స్టేషన్లు అద్భుతమైన పని తీరును కనబర్చాయని అన్నారు. ఇదేవిధమైన ఉత్తమ సేవలందించేందుకై మిగిలిన పోలీస్ స్టేషన్ల పనితీరును రెగ్యులర్ గా సమీక్షించాలని సీపీలు, ఎస్పీలను కోరారు. బ్లూ కోట్స్ పనితీరు అంశంలో ఉత్తమ పనితీరును కనపరిచిన పలు కమిషనరేట్లను, ఎస్పీలను డీజీపీ అభినందించారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఆదేశించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement