Wednesday, April 24, 2024

రేపు డిగ్రీ దోస్త్‌ నోటిఫికేషన్‌! కాలేజీ అడ్మిషన్లకు సన్నాహాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలోని ఏడు ప్రధానమైన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ ఫలితాలు ఈరోజు (మంగళవారం) విడుదల చేసిన‌ క్రమంలో ఒకవేళ వీలైతే ఈరోజు సాయంత్రం లేదా బుధవారం దోస్త్‌-2022-23 నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అర్హత కలిగిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని దాదాపు 1046 వరకు ఉన్న డిగ్రీ కాలేజీల్లో 3 విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టనున్నారు. సీట్ల కేటాయింపులు పూర్తయిన తర్వాత సెప్టెంబర్‌ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దోస్త్‌ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, కోఠి మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీకాలేజీల్లో అడ్మిషన్లను కల్పించనున్నారు. మొత్తం కాలేజీల్లో కలిపి దాదాపు 4.12 లక్షల వరకు డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీట్లు ఎప్పుడూ పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి. సగం వరకు సీట్లు ఖాళీగానే ఉండిపోతున్నాయి. ఈక్రమంలోనే జీరో అడ్మిషన్లు, అడ్మిషన్లు అతి తక్కువగా నమోదైన కాలేజీలు ఈ విద్యా సంవత్సరం చాలా వరకు మూతపడనున్నాయి.

ఈసారి మహిళా వర్సిటీలోనూ అడ్మిషన్లు!

కోఠిలోని ఉస్మానియా మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తూ ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి మహిళా వర్సిటీలోనూ అడ్మిషన్లు చేపట్టనున్నారు. అయితే ఇంటర్‌ ఫలితాలను నేడు ప్రకటించిన‌ నేపథ్యంలో ఇప్పటి వరకు నూతనంగా ఏర్పాటైన కోఠి మహిళా యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్లు చేపడుతున్నారా? లేదా? అనే దానిపై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. దీంతో అందులో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తుగా ప్రకటిస్తే దోస్త్‌ నోటిఫికేషన్‌ ద్వారా విద్యార్థులు వర్సిటీని ఎంచుకునే వీలుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ కోర్సులలో..

2022-23 విద్యా సంవత్సరానికి దోస్త్‌లో నమోదైన దాదాపు 1,046 డిగ్రీ కాలేజీల్లో దాదాపు 4 లక్షల 12 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. 2020-21 ఏడాదిలో 2లక్షల 28వేల వరకు సీట్లు భర్తీ అయితే, 2021-22లోనూ దాదాపు 50 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. చాలా మంది విద్యార్థులు సాంప్రదాయ కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడంలేదు. దాంతో ప్రతి ఏడాది సీట్లు భారీగా మిగులుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత బీఏ/బీఎస్సీ/బీకామ్‌(వోకేషనల్‌)/బికామ్‌(హానర్స్‌)/బీఎస్‌డబ్ల్యూ/బీబీఏ/బీబీఎం/బీసీఏ కోర్సులలో అర్హులైన అభ్యర్థులు డిగ్రీ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి డిగ్రీలో కొన్ని కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. కొత్త కోర్సుల మార్పిడికి ఇప్పటి వరకు దాదాపు 150 వరకు కాలేజీలు ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు, ఇతర రాష్ట్రాల/బోర్డు నుండి సమాన గుర్తింపు కలిగిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రతి ఏటా డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement