Thursday, April 25, 2024

దళితబంధుకు వేళాయే.. రంగారెడ్డి జిల్లాలో పంపిణీకి అంతా రెడీ

ఉమ్మడిరంగారెడ్డి, (ప్రభన్యూస్‌బ్యూరో) : అన్ని రంగాల్లో వెనకబడిపోయిన దళితులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన దళితబందు కార్యక్రమం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. సరూర్‌నగర్‌ పరిధిలోని విఎంహోంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీ చేయనున్నారు. కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనమిది నియోజకవర్గాల పరిధిలో 697మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో తొలి విడలో 50మందికి పంపిణీ చేయనున్నారుు. రూ. 70కోట్లకు గాను ఇప్పటివరకు కేవలం రూ. 35కోట్లు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నెలాఖరు వరకు మిగతా నిధులు వస్తాయనే నమ్మకంతో అధికారులు ఉన్నారు..

దళితబంధు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, కల్వకుర్తి, ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలున్నాయి. ఇందులో 697మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ రూ. 10లక్షల చొప్పున పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మండలానికి 20 మంది లోపే లబ్ధిదారులను ఎంపిక చేశారు. రెండో విడత మరింత మందిని ఎంపిక చేయనున్నారు. తొలి విడతలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున, చేవెళ్లలో 82మంది, ఎల్బీనగర్‌లో 81, శేరిలింగంపల్లిలో 72మంది, కల్వకుర్తి నియోజకవర్గంలో 62మందిని ఎంపిక చేశారు. శేరిలింగంపల్లి, కల్వకుర్తి, చేవెళ్ల, ఎల్బీనగర్‌ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గింది.మిగతా వారిని మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో ఎంపిక చేశారు. ఒకొక్కలబ్ధిదారునికి రూ. 10 లక్షల చొప్పున పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు తమ ఇష్టమున్న వ్యాపారాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు.ముందుగా వారికి అవగాహన కూడా కల్పించారు.

కావల్సినవి రూ. 70కోట్లు…వచ్చినవి రూ. 35కోట్లే..
దళితబంధు పథకం జిల్లాలో అమలుకు గాను రూ. 70కోట్లు అవసరం కాగా ఇప్పటివరకు కేవలం రూ. 35కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి మార్చి మొదటివారంలోనే గ్రౌండింగ్‌ చేయాల్సి ఉన్నా నిధుల లేమితో ఆలస్యమైంది. ఈ మాసంలో పూర్తి స్థాయిలో గ్రౌండింగ్‌ చేస్తారా అనే గ్యారంటీ లేకుండా పోయింది. మొదటి విడతలో జిల్లాలో కేవలం 50 మంది లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వాటిని మాత్రమే శుక్రవారం గ్రౌండింగ్‌ చేయనున్నారు. నెలాఖరు వరకు మిగతా వాటిని గ్రౌండింగ్‌ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మిగతా సగం నిధులు విడుదల చేస్తేనే అందరూ లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వాటిని గ్రౌండింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. డైరీకి సంబంధించి ప్రస్తుతం షెడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న తరువాత వర్షాకాలంలో పాడి గేదెలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ట్రాక్టర్లు…కార్లకే ప్రాధాన్యం..
దళితబంధు పథకంలో భాగంగా ఎక్కువమంది లబ్ధిదారులు ట్రాక్టర్లు, కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో సగానికి పైగా ట్రాక్టర్లు, కార్లను ఎంపిక చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనమిది నియోజకవర్గాల్లో 697మంది లబ్ధిదారుల్లో ఏకంగా 391మంది ట్రాక్టర్లు, కార్లను ఎంపిక చేసుకోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ల వాడకం పెరిగిపోయింది. వ్యవసాయ పనులకు ఎక్కువగా ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. అందుకే ఎక్కువమంది లబ్ధిదారులు వాటినే ఎంపిక చేసుకున్నారు. ఇతర వ్యాపారాలను కూడా ఎంపిక చేసుకున్నారు. వీటిని 181మంది ఎంపిక చేసుకున్నారు. మినీ డైరీని 79మంది లబ్ధిదారులు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. వీరికి షెడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. చిన్న పరిశ్రమల వైపు కొందరే మొగ్గు చూపారు. 43మంది పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. ఎరువులు, విత్తనాల దుకాణాల ఏర్పాటు చేసేందుకు కొందరే మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ముగ్గురు మాత్రమే వాటిని ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎరువులు, విత్తనాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. చాలామంది మండల కేంద్రాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఊరిలోనే ఎరువులు, విత్తనాల దుకాణం ఏర్పాటు చేస్తే అక్కడే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు ఇష్టపడ్డ పథకాలనే గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు వాళ్లు ఇష్టపడ్డ వాటినే ఎంపిక చేశారు. విడతల వారీగా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న దళితులందరికీ దళితబంధు పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పథకం ద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కలగనుంది. మొత్తం మీద దళితబంధు పథకం వారి జీవితాల్లో వెలుగు నింపనుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement