Sunday, October 13, 2024

కంటి వెలుగుపై సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంపై జిల్లా కలెక్టర్లు, సీపీలు/ఎస్పీలు, వైద్య, ఇతర శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ అంజనీ కుమార్ తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని 18న ఖమ్మంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనుండగా, ఈనెల 19 నుంచి రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో ప్రారంభించనున్నామని, ఇందులో ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 15000మంది సిబ్బంది నిర్వహించే ఈ కంటి పరీక్షలకు కావలసిన ఏ.ఆర్ యంత్రాలు, కళ్లద్దాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వైద్య శిబిరాలకు హాజరయ్యే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడం తోపాటు, రోగి వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 2018లో నిర్వహించిన కంటి వెలుగు మొదటి దశలో రాష్ట్రం అత్యుత్తమ ట్రాక్‌ రికార్డును సాధించిందని, గత రికార్డును అధిగమించేందుకు కృషి చేయాలని సీఎస్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.


ఖమ్మం నుంచి పాల్గొన్న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టీ.హరీశ్‌రావు మాట్లాడుతూ.. కంటి పరీక్షలు నిర్విఘ్నంగా నిర్వహించేలా రోగులను చైతన్యవంతం చేయాలని సూచించారు. నేత్ర వైద్య శిబిరాన్ని సకాలంలో ప్రారంభించేందుకు వీలుగా వైద్య బృందాలన్నీ సమయానికి కనీసం 15 నిమిషాల ముందుగా కేంద్రానికి చేరుకునేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. శిబిరాలు రద్దీగా ఉండకుండా, స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా, అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు ఆరోగ్య, పోలీసు శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం అవసరమని డీజీపీ అంజనీ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శాఖ కమీషనర్ శ్వేతా మహంతి కంటి వెలుగు కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. క్యాంపు ఏర్పాట్లు, లాజిస్టిక్స్, సమీకరణ మొదలైన వాటి గురించి వివరించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రాచకొండ కమిషనర్ DS చౌహాన్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement