Tuesday, April 23, 2024

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం : తరుణ్ జోషి

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి స్పష్టం చేశారు. నేరాలు చేయడానికి దొంగలు భయపడుతున్నారని గుర్తించి, నేర రహిత నగరంగా తీర్చిదిద్దుకొనేందుకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని కాలనీ వాసులంతా స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కూడా పోలీస్ బాస్ డా.తరుణ్ జోషి పిలుపునిచ్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ లో ప్రజల భాగస్వామ్యంతో నూతనంగా నెలకొల్పిన 17 సీసీ కెమెరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మాట్లాడుతూ… నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా నిలువడమే కాక, నేర నిరూపణలోనూ ప్రధాన భూమికను పోషిస్తున్నాయన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును సామాజిక బాధ్యతగా భావించి, అన్నీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ కోరారు. సీసీ కెమెరాలు భద్రతతో పాటు, భరోసాను కలిగిస్తాయని గుర్తించి, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాముఖ్యతనివ్వాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప రెడ్డి కోరారు. సీసీ కెమెరాలు వంద మంది పోలీసులతో సమానమన్నారు. నేరాల నియంత్రణ, నిరూపణకు దోహ‌ద‌పడుతున్నాయన్నారు. కోర్టులో నేర నిరూపణలు తగిన సాక్ష్యాధారాలతో నిరూపితమై, శిక్షలు ఖరారవుతున్నాయని డీసీపీ పుష్ప రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమములో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా రెడ్డి, హన్మకోండ ఏసీపీ జితేందర్ రెడ్డి, సుబేదారి ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్, ఎస్.ఐ వీరేందర్ , స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement