Saturday, April 20, 2024

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు రేపే..

తెలంగాణ‌లో 10వ తేదీన జరిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు రేపు (మంగళవారం) జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో 2 స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ జ‌రిగింది. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపును ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయి ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యే అవ‌కాశం ఉంది.

కాగా, కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జరగకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అత్య‌ధికంగా 99.70 శాతం పోలింగ్ న‌మోదు కాగా, 1,324 మంది ఓట‌ర్ల‌కు గానూ 1,320 మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో 99.22 శాతం పోలింగ్ (1018/1026), ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో 97.01 శాతం (1233/ 1271), ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 96.09 శాతం (738/768), ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్ (860/937) న‌మోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement