Thursday, April 18, 2024

కాంగ్రెస్ పరువు తీసేది ఎవరు?

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో గాంధీ భవన్ మెట్లే ఎక్కనని తేల్చి చెప్పిన కోమటిరెడ్డి.. అనంతరం విభేదాలు పక్కన బెట్టి అందరం కలిపి పనిచేస్తామంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే, షర్మిల పార్టీకి బహిరంగంగా మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది.

జులై 8న పార్టీ షర్మిల పార్టీ ప్రకటన సందర్భంగా ఆరోజే ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన కోమటిరెడ్డి.. సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ ఏర్పాటు చేసిన వైఎస్ సంస్మరణ సభకు ఆయన హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. సభకు వెళ్లొద్దని పార్టీ ఆగ్రనేతలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ఆయన మాత్రం అవి పట్టించుకోకుండా సభకు వెళ్లారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ ఆదేశాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని తీసి పక్కన పడేసినంత పనిచేశారు. అంతేకాదు రేవంత్‌తో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే సీతక్కపై కోమటిరెడ్డి పేరెత్తకుండానే పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు.

మూడు రోజుల ముందు సభ ఖరారైతే.. కేవలం రెండు గంటల ముందు ఆదేశాలివ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ నిర్ణయం పెద్ద తప్పని.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయిన వ్యక్తి సంస్మరణ సభకి వెళ్లొద్దనడం సరికాదన్నారు. అది వైఎస్‌ని అవమానించడమే అవుతుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తామేమీ జగన్, షర్మిల పార్టీ మీటింగ్‌లకి వెళ్లలేదన్నారు. విజయమ్మ తనకి మూడు రోజుల కిందటే ఫోన్ చేసి సభకి వచ్చి మీ అన్న గురించి రెండు మాటలు చెప్పమంటే వస్తానని మాటిచ్చానని కోమటిరెడ్డి తెలిపారు. అన్ని పార్టీల వాళ్లు, వ్యాపారవేత్తలు, మేధావులు అందరూ వచ్చారని.. సభ వెనక ఎలాంటి రాజకీయ రహస్య ఎజెండా ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సే తయారు చేసిన వారేనని అన్నారు. అలాంటి వ్యక్తి భార్య ఫోన్ చేసి రమ్మంటే వెళ్లకపోతే మానవత్వం ఉన్న మనుషులం అనిపించుకోమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ఎవరి సొంతం కాదని స్పష్టం చేశారు. సీతక్కపై కూడా పరోక్ష విమర్శలు చేశారు కోమటిరెడ్డి. టీడీపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాదాభివందనాలు చేస్తున్నారని.. వాళ్లకి పాదాభివందనాలు చేస్తే కాంగ్రెస్‌కి ఓట్లు పడవంటూ ఘాటు విమర్శలు చేశారు. అమెరికాలో ఒబామా కేర్ పెట్టకముందే రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పెట్టారని.. ఫీజు రీఇంబర్స్‌మెంట్, ముస్లింల రిజర్వేషన్ ఇచ్చిన వైఎస్‌ని పార్టీ ఓన్ చేసుకోవాలన్నారు. వైఎస్ సంస్మణ సభ విషయంలో టీపీసీసీ తప్పుడు నిర్ణయం తీసుకుందని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి నిర్ణయాలు పార్టీకి నష్టం చేస్తాయని.. ఈ విషయంపై ఢిల్లీలో కూడా మాట్లాడతానని ఆయన చెప్పారు.

- Advertisement -

కోమటిరెడ్డి వ్యవహారం ఇప్పుడు టీ.పీపీసీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ హైకమాండ్ ఆదేశాలను ఆయన లెక్క చేయడం లేదని పార్టీలోని ఓ వర్గం నేతలు మండిపడుతున్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కోమటిరెడ్డి తీరుపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేయాలని కొంత మంది నేతలు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Tokyo Paralympics: చ‌రిత్ర సృష్టించిన‌ అవ‌ని.. భారత్ కు పతకాల పంట

Advertisement

తాజా వార్తలు

Advertisement