Friday, April 26, 2024

జగ్గారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్!

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల పై అధిష్ఠానం సీరియస్ అయింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయ పడింది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇన్​ఛార్జి మాణికం ఠాగూర్ ఆరా తీశారు.
జగ్గారెడ్డిని పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడాలని ఏఐసీసీ కార్యదర్శులను ఆదేశించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే తనకు… తన నియోజకవర్గంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. “నాకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడి మేరకు సభాధ్యక్షురాలు గీతారెడ్డి మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏమి జరుగుతుంది? ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు? ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు. చిరంజీవి, రజనీకాంత్​ లాంటి వారే కనుమరుగయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ మద్ధతు లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తా” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement