Saturday, March 23, 2024

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి… సిపి రెమా రాజేశ్వరి

పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు, చట్టపరంగాను, న్యాయపరమైన ఫిర్యాదులపై అధికారులు కేసులు నమోదు చేయడం ద్వారా పోలీసులపై నమ్మకం కలుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఎన్టిపిసి లోని హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ… పెద్దపల్లి, మంచిర్యాల డిసిపి లకు వారి వారి జోన్ల పరిధిలో ఉన్న కళాశాల, స్కూల్స్ లిస్టు తయారు చేసుకుని సైబర్ క్రైమ్స్, విమెన్ సేఫ్టీ, విద్యార్థినీ విద్యార్థులకు యుక్త వయసులో తాత్కాలిక ఆనందాల కోసం ఆకర్షణ, ప్రలోభాలకు గురై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులను చైతన్య పరుస్తూ తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రివెంటివ్ పోలీసింగ్ లో భాగంగా స్కూల్స్, కాలేజీల ముగింపు సమయంలో విద్యార్థినీ, విద్యార్థులు ఆకర్షణలకు, ప్రలోభాలకు గురై ఇంటి నుండి వెళ్లిపోవడం, మోసపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం, మిస్సింగ్ కేసులు గురించి, తర్వాత జరిగే ఇబ్బందుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేసవి కాలంలో పిల్లలకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో ప్రజలు దైవదర్శనాలకు, ప్రత్యేకమైన టూర్లకు, బంధువుల ఊర్లకు వెళ్లడం జరుగుతుందని, ఈ సమయంలో ఎక్కువ ప్రాపర్టీ సంబంధిత నేరాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని పాత నేరస్తులందరి పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరు నిర్వహణ, బీట్ పోలీసింగ్ వ్యవస్థని పటిష్టం చేయాలని, ప్రాపర్టీ సంబంధిత నేరాలు తగ్గించడానికి అందరూ కృషి చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్, బీట్స్ ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి కన్విక్షన్ రేటును పెంచాలని సూచించారు.

స్టేషన్ అధికారులు నమోదు చేసిన ప్రతి కేసులోని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుసరించాలని, అలాగే డిసిపిలు, ఎసిపిలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్లు తమ పరిధిలో నమోదైన కేసులను ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని తెలిపారు. వ్యక్తిగత క్రమ శిక్షణ, నిబద్దతతో పనిచేయాలని, పోలీస్ వ్యవస్థ, శాఖకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల అంశాలపై, దొంగతనాలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంపాటు, నాన్-బెయిల్ వారెంట్లు, సైబర్ క్రైం నిందితులను పట్టుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ మరియు సిసిఎస్ పోలీసులతో సమన్వయపర్చుకుంటూ నిందితులను పట్టుకోవాలన్నారు. ప్రాజెక్ట్ లు, సంస్థలు ప్రశాంత వాతావరణంలో పని చేసే లాగా చూడాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని, దొంగతనాల నివారణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ నేను సైతం కార్యక్రమంలో భాగంగా తమ తమ ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా వారిని భాగస్వాములను చేయాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని తెలియజేసారు. 5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఫంక్షన్ వర్తికల్స్, విధులలో ప్రతిభ కనబరచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, ఏసీపీ ట్రాఫిక్ బాలరాజ్, సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఉపేందర్ లు కమిషనరేట్ పరిధిలోని సీఐ లు, సీపీఓ సిబ్బంది, సిసి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement