Saturday, March 23, 2024

TS: రైతును రాజు చేయ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యం… మంత్రి త‌ల‌సాని

దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్బంగా బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో రైతులతో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలి… గౌరవించుకోవాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తుందని వివరించారు. 2014 సంవత్సరానికి ముందు రైతులు అనేక సమస్యలతో సతమతమ‌య్యే వారని, పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధరలు లభించేవి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి… రైతులు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా, నూతన ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. పంట పెట్టుబడుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి రూ.10 వేల ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంలో దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని తెలిపారు. స్వయం పాలన వచ్చిన తర్వాత సాగు, త్రాగునీటి సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నా గత పాలకులు పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెలిపారు.

ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం సంవత్సరానికి 12 వేల కోట్ల రూపాయలను భరిస్తుందని, పంట పెట్టుబడి సాయం కోసం 15వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. గతంలో వ్యవసాయానికి విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండి రైతులు ఎన్నో ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులకు తీవ్రంగా నష్టం కల్పించే నకిలీ విత్తనాలను అరికట్టడానికి పీడీ యాక్ట్ ను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు కోటి 31 లక్షల ఎకరాల భూమి సాగులో ఉండగా, నేడు 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. అదేవిధంగా నాడు 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండగా, నేడు 2.70 కోట్ల టన్నులకు పెరిగిందని వివరించారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో రైతు భీమా క్రింద 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులను మంత్రి రాష్ట్రం ఆవిర్భావంకు ముందు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను అడిగారు. తమకు విద్యుత్, నీటి కొరత ఏం లేదని, చాలా సంతోషంగా ఉన్నామని వివరించారు. అనంతరం పలువురు రైతులు, హమాలీలను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక ఆనంద్ గౌడ్, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, మార్కెటింగ్ జేడీ ఇప్తెకార్, సభ్యులు సోమ దేవేందర్ రెడ్డి, మార్కెట్ కార్మికుల యూనియన్ అద్యక్షులు తలసాని శంకర్ యాదవ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, నాయకులు నివేదిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement