Thursday, April 25, 2024

సీఎం కేసీఆర్ విఫ‌లం : జ‌గ్గారెడ్డి

ప్రజలకు ఇచ్చిన‌ హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏడున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. రైతు రుణమాఫీపై కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో రైతులకు సబ్సిడీలు లేక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర లేదని, సీఎం మాటలు నమ్మి వరి వేయని రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వరి పంట వేయని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రజా పాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్‌లో టీఆర్ఎస్ నడుస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మల్లకుండా బీజేపీ వైపు మళ్లిస్తుందన్నారు. వరంగల్‌‌లోని రాహుల్ గాంధీ సభను కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపిచ్చారు. రైతు సమస్యలు, ప్రజా వ్యతిరేక పాలనపై సభలో రాహుల్ ప్రస్తావిస్తారన్నారు. 5 లక్షల మందితో సభను విజయవంతం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement