Saturday, April 20, 2024

Big Story: చెన్నూరు, అభివృద్ధికి మారుపేరు.. 500 కోట్లతో మున్సిపాలిటీల డెవలప్​మెంట్​

చెన్నూరు.. ఒకప్పుడు రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో అట్టడుగు స్థానం.. కానీ పవిత్రతకు మారుపేరు.. గోదావరి, ప్రాణహిత నదులు కలిసే పుణ్యస్థలం.. ఇంత పేరున్నా అభివృద్ధిలో పూర్తిగా భిన్నం.. నియోజకవర్గ కేంద్రానికి గ్రామాల నుండి రహదారుల సౌకర్యం లేనంత దీనస్థితి.. గ్రామాల పరిస్థితి కంటే పట్టణాల పరిస్థితి అంతకంటే కడుహీనం.. ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి.. 1993లో కేంద్ర ప్రభుత్వం మందమర్రిని 1/70 షెడ్యూల్డ్‌ పరిధిలోకి తెస్తూ నోటిఫై చేయడంతో పురపాలక ఎన్నికలు జరగడం లేదు. దీంతో నిధులు రాక అభివృద్ధికి దూరమైంది. గతంలో మందమర్రి మున్సిపాలిటీ మాత్రమే ఉండగా, మేజర్‌ గ్రామపంచాయతీలుగా ఉన్న చెన్నూరు, క్యాతనపల్లి లను తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలుగా మార్చింది..

ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌.. మరో పక్క దక్షిణ భారత దేశానికే వెలుగులు నింపుతున్న ఎన్టిపిసి సమీపంలోనే అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న మంచిర్యాల.. చుట్టు పక్కల ఇంత అభివృద్ధి ఉన్నా మూడు పట్టణాలు అభివృద్ధికి కొన్ని దశాబ్దాలుగా దూరంగా ఉన్నాయి.. ఉద్యమనేత, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు, విద్యార్థి దశ నుండే సమస్యలపై సమరశంఖం పూరించిన వీరుడు బాల్క సుమన్‌ 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది ఆ నియోజకవర్గంలో కమ్ముకున్న చీకట్లను పార దోలడం లో కీలక మలుపు తీసుకుంది..

మరోవైపు ఉద్యమ స్వభావం, బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండటం ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ఉద్యమ కాలం నుండి ఉన్న సాన్నిహిత్యం చెన్నూరు నియోజకవర్గ ప్రజల అదృష్టమని చెప్పవచ్చు.. గతంలో ఎన్నడూ లేని విధంగా చెన్నూరు నియోజకవర్గానికి నిధుల వరద ప్రారంభమైంది.. ఐదు దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు మూడేళ్లలోనే పటాపంచలయ్యాయి. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం టీయూఎఫ్‌ఐడీసీ, డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌, పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్‌ ప్లాన్‌, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, ఫైనాన్స్‌ కమిషన్‌, జనరల్‌ ఫండ్‌ల నుంచి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు సాగుతున్నాయి.. ప్రస్తుతం మున్సిపాలిటీ-లలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తే నియోజకవర్గ ప్రజలే కాదు.. రాష్ట్రంలోని ఎక్కడివారైనా బాల్క సుమన్‌ వల్లే ఇది సాధ్యమైందని కితాబు ఇస్తున్నారు.. చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ”ఆంధ్రప్రభ” గ్రౌండ్‌ రిపోర్ట్‌..

చెన్నూర్‌ మున్సిపాలిటీకి నిధుల వరద
గతంలో పేరుకే ఇది చెన్నూరు నియోజకవర్గ కేంద్రం. కోటపల్లి, భీమారం, చెన్నూరు మండలాల కేంద్ర బిందువు. అయినా అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కానీ ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అకుంఠిత దీక్ష, పట్టు-దలతో ఒక్క చెన్నూరు మున్సిపాలిటీలోనే సుమారు 140 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు 90 శాతం మేరకు పూర్తయ్యాయి. ముఖ్యంగా 25 కోట్ల రూపాయలతో జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుండి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు పెద్ద చెరువు నుండి బుద్ధారం రోడ్డు వరకు నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డు పట్టణానికి మణిహారంగా తయారైంది. ఇటీ-వలే మసకబారిన చెన్నూరు చరిత్రను రూపుమాపుతూ చీకట్లను చీల్చుతూ వెలుగును ప్రసారించే సెంట్రల్‌ లైటింగ్‌ను విప్‌ బాల్క సుమన్‌ ప్రారంభించారు. మున్సిపాలిటీ-లోని 17.52 కోట్లతో 99.49 కిలోమీటర్ల పైపులైన్‌ వేసి 7629 గృహాలకు తాగునీరు అందిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను 12.79 లక్షలతో మన ఊరు మన బడి పథకం ద్వారా మెరుగుపరుస్తున్నారు.

చెన్నూరు మున్సిపాలిటీ-తోపాటు- అత్యంత మారుమూల ప్రాంతమైన కోటపల్లి, చెన్నూర్‌, భీమారం మండలాల పేద ప్రజలకు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి వీలుగా కార్పొరేట్‌ స్థాయిలో పట్టణం నడిబొడ్డున 7 కోట్ల రూపాయలతో ప్రభుత్వ దవాఖాన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే 40 ఏళ్ల జనాభా అంచనా దృష్ట్యా ముందుచూపుతో 7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రాష్ట్రంలోనే నిష్ణాతులైన డిజైనర్లు రూపొందించిన డిజైన్లతో పెద్ద చెరువు, ఆస్నాద్‌ చెరువు ట్యాంక్‌ బండ్‌లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సదుద్దేశంతో 5 కోట్లతో స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇటీవల కోటి రూపాయలతో ప్రారంభించిన గ్రంథాలయం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం చెన్నూరు పట్టణంలో 21.02 కోట్లతో 400 ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అంతే కాకుండా ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా 10 కోట్లతో అంతర్గత రోడ్లు, 90 లక్షలతో 18 వార్డుల్లో 18 బతుకమ్మ గ్రౌండ్స్‌, 2.50 కోట్లతో కేసీఆర్‌ పార్క్‌, కోటి రూపాయలతో వైకుంఠధామం, కోటి రూపాయలతో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌, 40 లక్షలతో రెండు ఓపెన్‌ జిమ్స్‌, 1.50 కోట్లతో డంపింగ్‌ యార్డ్‌, 1.50 కోట్లతో సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్‌, 80 లక్షలతో 4 కేసీఆర్‌ మల్టీపర్పస్‌ కమ్యూనిటీ- భవనాలు, కోటి రూపాయలతో స్వచ్ఛ ఆటోలు, కోటి రూపాయలతో కాలువలు, ఒక కోటితో బృహత్‌ పట్టణ ప్రకృతి వనం, 5 చిల్డ్రన్స్‌ ప్లేఏరియా, 2.58 కోట్లతో జంతు వధశాల ఏర్పాటు చేస్తున్నారు.

మారనున్న మందమర్రి రూపురేఖలు
మందమర్రి పట్టణం మున్సిపాలిటీగా అవతరించినా కేంద్ర ప్రభుత్వం 1993లో 1/70 షెడ్యూల్డ్‌ పరిధి కింద నోటిఫై చేయడంతో ఇక్కడ పాలకవర్గానికి ఎన్నికలు జరగడం లేదు. దీంతో అభివృద్ధికి మందమర్రి దూరమైంది. పాలకవర్గం లేని పట్టణంపై ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. సింగరేణి విస్తరణలో భాగంగా ఈ ప్రాంత మనుగడే కష్టం అనుకున్న తరుణంలో పట్టణానికి తిరిగి జీవం పోస్తూ మున్సిపాలిటీ-లో ఏకంగా 162.27 కోట్లతో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పట్టణంలొని 24 వార్డుల్లో సుమారు 25 కోట్లతో అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 80శాతం మేర పనులు పూర్తయ్యాయి. పట్టణానికి ఆనుకుని భారీ స్థాయిలో 29.68 కోట్ల రూపాయలతో 560 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చాయి. మౌలిక వసతుల ఏర్పాటు పూర్తిచేసుకుని అతి త్వరలో పేదలకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పట్టణంలోని మహిళలకు అందుబాటు-లో ఉండేలా 2.04 కోట్లతో సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్‌ నిర్మిస్తున్నారు. 24 వార్డుల్లో మహళలు కోరుకున్న చోట 1.35 కోట్లతో 24 బతుకమ్మ గ్రౌండ్లను ఏర్పాటు- చేస్తున్నారు. దశాబ్దాలుగా పట్టణంలో నెలకొన్న త్రాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ 40 కోట్లతో అర్బన్‌ భగీరథ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రజల విజ్ఞప్తి మేరకు ఒక్క ఇల్లు నేలమట్టం కాకుండా 27.05 కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌ఓబీ పనుల పట్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చెస్తున్నారు. ప్రజలందరికీ చేరువలో అందుబాటు-లో ఉండేలా 7.20 కోట్లతో ఇంటిగ్రే-టె-డ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన మందమర్రి పట్టణంలో 3 కోట్లతో ఐటిఐ కళాశాల భవనం నిర్మించారు. అలాగే 3.50 కోట్లతో కేసీఆర్‌ పార్క్‌, 5కోట్లతో స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌, 2.68 కోట్లతో వైకుంఠధామం, 60 లక్షలతో ముస్లిం, క్రిస్టియన్‌ స్మశాన వాటికలు, మన ఊరు మన బడి పథకం ద్వారా 10 లక్షలతో ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరుస్తున్నారు. 2.78 కోట్లతో జంతు వధశాల, 1.39 కోట్లతో 13 ఓపెన్‌ జిమ్స్‌, 1.70 కోట్లతో పార్కులను నిర్మిస్తున్నారు.

క్యాతనపల్లికి పునర్జీవం
గత పాలకుల నిర్లక్ష్యం క్యాతనపల్లి మున్సిపాలిటీ-కి శాపంగా మారింది. జిల్లా కేంద్రానికి కూతవేటు- దూరంలో ఉన్నా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సింగరేణి గనుల మూతతో మున్సిపాలిటీ-లో ప్రధాన పట్టణమైన రామకృష్ణాపూర్‌ అస్తిత్వాన్ని కోల్పోతున్న తరుణంలో పట్టణ అస్తిత్వం.. పునర్జీవం లక్ష్యంతో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఈ మున్సిపాలిటీ-పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏకంగా 145.83 కోట్ల నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీ-కి తిరిగి ప్రాణం పోశారు. రామకృష్ణాపూర్‌ పట్టణ చిరకాల వాంఛ క్యాతనపల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని అనేక వ్యయ ప్రయాసల కోర్చి 27.50 కోట్లతో నిర్మించారు. 90శాతం మేర పనులు పూర్తయిన ఈ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి త్వరలోనే పట్టణ ప్రజలకు అందుబాటు-లోకి రానుంది. పట్టణ ప్రజలకు అందుబాటు-లో ఉండేలా 7.20 కోట్లతో వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పనులు శరవేగంతో కొనసాగుతున్నాయి. 15.15 కోట్లతో నిర్మిస్తున్న 286 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది.

మౌలిక వసతులు కల్పించిన అనంతరం వీలైనంత త్వరలో నిరుపేదలకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 22 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా 171 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేసి 11,328 గృహాలకు నల్లా ద్వారా నీళ్లు అందిస్తున్నారు. దినదినాంతం అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో సుమారు 20 కోట్ల పైచిలుకు నిధులతో అంతర్గత రోడ్లు, కాలువలు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. 1.70 కొట్లతో పట్టణం మొత్తం విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు- చేశారు. 1.70 కోట్లతో సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్‌, 2.83 కోట్లతో జంతు వధశాల, 3.29 కోట్లతో మూడు మల్టీపర్పస్‌ కమ్యూనిటీ భవనాలు, 1.42 కోట్లతో ఊర చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌, 1.10 కోట్లతో 22 బతుకమ్మ గ్రౌండ్స్‌, 2 కోట్లతో 30 ఎకరాల్లో అంబేద్కర్‌ అర్బన్‌ ఎకో పార్క్‌, కోటి రూపాయలతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు.

సుమన్‌ వల్లే సాధ్యమైంది
గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడం బాల్క సుమన్‌ వల్లే సాధ్యమైందని మూడు పట్టణాల ప్రజలు ఎమ్మెల్యే పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుండడం వల్ల పట్టణాల రూపురేఖలు మారి ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోక పోయినా యువకుడైన సుమన్‌ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే అభివృద్ధి పరుగులు తీస్తుందని చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement