Saturday, April 20, 2024

ధరల స్థిరీకరణకు కేంద్రం నిర్ణయం.. ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు ఫండ్స్ రిలీజ్‌..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వినియోగదారుడి జేబు ఖాళీ చేస్తున్న నిత్యావసరాల ధరల స్థిరీకరణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్ర ప్రభుత్వం అందించింది. ఏపీ, తెలంగాణతో పాటు 6 రాష్ట్రాలకు రూ. 164.15 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేసింది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు ఈ నిధులను వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్‌లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బ తినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం చూపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాటా సగటు ధర రూ. 67. గతేడాదితో పోలిస్తే 63 శాతం టమాటా ధర పెరిగింది.

అకాల వర్షాల కారణంగా పంట నష్టం, సరఫరాపై ప్రభావంతో టమాటా ధరలు పెరిగాయి. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. గతేడాది ఇదే సమయానికి 70.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతేడాతో పోలిస్తే టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అకాల వర్షాలు, రవాణా కష్టాలతో దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి ఉల్లి సగటు ధర రూ. 39 రూపాయలకు పెరిగింది. ఉల్లి ధరను నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్‌కు కేంద్రం ఉల్లిని విడుదల చేసింది.

కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి సరఫరా చేసిన ఉల్లి ధర రవాణా ఖర్చుతో కలిపి కిలో రూ. 26కు చేరుకుంది. మరోవైపు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఉల్లి మార్కెట్లలోకి చేరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలకే కాక సగటు వినియోగదారుడూ ఊపిరి పీల్చుకోనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement