Friday, February 3, 2023

భారాస ఎక్కుపెట్టిన బ‌డ్జెటాయుధం…

ఫిబ్రవరి 3న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు తుది రూపం రావడంతో ఆ తర్వాత జరిగేచర్చపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌ కేటాయింపుల్లో నిర్లక్ష్యాన్ని చూసి ఇదే అంశాన్ని, గడచిన ఎనిమిదేళ్ల కేటాయింపులు, నిధుల విడు దల లెక్కలు ప్రస్తావించి, జాతీయ స్థాయిలో మైలేజీ పొందాలని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ భావిస్తోంది… ఈ క్రమంలోనే కేంద్ర సాయాలు, గ్రాంట్లు, ఇతర వివరాలను క్రోడీకరించి నివేదిక సిద్ధం చేసింది… తెలంగాణపై కేంద్రం శీతకన్ను వేసిందని గణాంకాలతో రుజువు చేయనుంది… ప్రధానంగా గ్రాంట్లు, పన్ను ఆదాయం, జీఎస్‌టీ చెల్లింపులు ఇతర నిధుల విషయంలో పెద్దఎత్తున కోత విధిస్తున్న తీరును సభ వేదికగా ఎండగట్టాలని చూస్తోంది… ఇక రాష్ట్రానికి కేంద్రం ఎనిమిదేళ్లలో ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్‌ క్షేత్ర సర్వేలతో సమాచార సేకరణ జరిపి ఇప్పటికే ఎన్నికల సమరాంగణంలో ముందు వరుసలో ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నది. అసెంబ్లి నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల బలా బలాలు, బలహీనతలపై ఆరా తీసింది. ఎక్కడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి వాటిని చక్కదిద్దే పనిలో ఇప్పటికే అధిష్టానం నిమగ్నమైంది. గెలుపు గుర్రాలపై పూర్తి సమాచారం రెడీ చేసి పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జిల్లాల టూర్లు పూర్తి చేసుకుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలన్నీ అలర్ట్‌ అయ్యాయి. మిషన్‌ తెలంగాణ పేరుతో బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ పాదయాత్రలకు సిద్ధమవు తోంది. అన్ని పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలతో రెడీ అవుతున్నాయి. అయితే రాజకీయ వేడి పుట్టించిన తాజా ఊహాగానాలు… బీఆర్‌ఎస్‌ అధిపతి తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ముందస్తు నిజమా లేక బీఆర్‌ఎస్‌ వ్యూహంలో భాగమా అనేది ఫిబ్రవరి నెలాఖరుకు తేలిపోనుంది. ఫిబ్రవరి చివరికి ఈ అంశంపై పూర్తి క్లారిటీ రానుందని పార్టీలన్నీ ఫిబ్రవరి ఫీవర్‌తో ఎదురు చూస్తున్నాయి.

- Advertisement -
   

ఫిబ్రవరి అంతా అనుకున్నట్లుగా జరిగితే బడ్జెట్‌ పూర్తిచేసుకొని, అదేనెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే చివరి కేబినెట్‌ సమావేశాలు కొత్త సచివాలయంలో జరుపుకోవడంతోనే అసెంబ్లిd రద్దుకు తీర్మానం చేయనున్నారనే ఊహాగానాలు జోరందు కున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమతమ సర్వేలను వెలువరించగా, ముందస్తుతోనే బీఆర్‌ఎస్‌కు లాభం జరుగుతుందని, సాధారణ ఎన్నికల్లో దేశమంతటా బీఆర్‌ఎస్‌కు ప్రచారం చేసుకుని అభ్యర్థులను బరిలో దించేందుకు సమయం చిక్కుతుందని విశ్లేషిస్తున్నారు. తాజాగా పలు వేదికలపై సీఎం కేసీఆర్‌ మాత్రం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని చెబుతూ వచ్చారు. అయితే సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగితే వాటిని ముందస్తుగా పరిగణించొద్దని సీఎం కేసీఆర్‌ లాజిక్‌గా ఉందని, అందుకే ఇలా చెప్పారని పలువురు విశ్లేషిస్తున్నారు. బీజేపీని మరింత బలపడే సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్‌గా ఉందని అంటున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వస్తే నేను కూడా అసెంబ్లి రద్దు చేస్తా. డేట్‌ ఫిక్స్‌ చేస్తే అసెంబ్లి రద్దు చేసి ముందుకెళతాం అని స్పష్టంగా ప్రకటించారు.

పన్నుల వాటాలోనూ కోతలే…
కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడం, గతంలో ఉన్న 2.347శాతం వాటా 2.133 శాతానికి తగ్గించడంతో రాబడిలో భారీగా కోతలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పూచీకత్తు రుణాలు, ఇతర అప్పులకు వడ్డీలను సకాలంలో చెల్లిస్తూ నెలకు రూ.1883 కోట్లు చెల్లిస్తున్నది. ఇదే సమయంలో గతేడాది నెలకు రూ.1466 కోట్లను సగటుగా చెల్లింపులు వడ్డీలకు చేసింది.

కేంద్ర నిర్లక్ష్యం ఫలితంగానే….
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. అయినప్పటికీ ఎటువంటి ప్రతికూలతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్న తెలంగాణ తాజా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడిలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్‌ 12.9 శాతం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ వృద్ధి రేటును నమోదు చేయడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆర్థిక వృద్ధికి ఆటంకాలు
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని బహిరంగ బెదిరింపులకు కేంద్రం దిగుతోంది. ఇలా ఈ ఏడాదిలో ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని ఆర్ధిక వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement