Thursday, November 28, 2024

ADB | అదిగో పులి.. ఇదిగో జాడ!

  • మహబూబ్ ఘాట్ రోడ్డు దాటుతూ కంటపడ్డ బెబ్బులి
  • హడలెత్తిపోతున్న నిర్మల్ జిల్లా ప్రజలు
  • మంచిర్యాల జిల్లాల్లోనూ టైగర్ హల్ చల్


ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ బ్యూరో : అడవుల జిల్లాలో పెద్దపులుల సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అటవీ శివారు గ్రామాల ప్రజలు పది రోజులుగా బెబ్బులి భయంతో బెంబేలెత్తిపోతున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం పాత జాతీయ రహదారి మహబూబ్ ఘాట్స్ పై అర్ధరాత్రి రోడ్డు దాటుతూ పెద్దపులి వాహనదారులకు కంటపడింది. దర్జాగా రోడ్డు దాటుతుండగా పెద్దపులి కదలికలను వాహనదారులు వీడియో తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులిజాడ కోసం అన్వేషిస్తున్న అధికారులు అది కాస్త మ‌న స‌రిహ‌ద్దు దాటి మహారాష్ట్ర తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని భావించారు. తీరా నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో పులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

ఇవాళ‌ ఉదయం మామడ మండలం బూరుగుపల్లి వద్ద పంట చేనులోకి వెళ్లిన లక్ష్మి అనే బాలిక పెద్దపులిని చూసి ఊపిరి బిగబట్టుకొని ఇంటికి పరుగు తీసింది. గంటసేపు షాక్‌కు గురైన ఆమె పెద్దపులి పేరు చెబితేనే భయపడేదాన్నని, కళ్ళ ముందు స్వయంగా చూసి ప్రాణాలతో బయటపడ్డానని చెప్పింది. నిర్మల్ జిల్లాలో పెద్దపులి జాడ బయటపడడంతో అటవీ అధికారులు అప్రమత్తమై రహదారి రాకపోకలు నిలిపివేశారు. నిర్మల్ బైపాస్ జాతీయ రహదారి గుండా వాహనాలను దారి మళ్ళించారు.

- Advertisement -

పెద్ద పులులతో అటవీ గ్రామాలు భయం భయం…
మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న పెన్ గంగా, ప్రాణహిత నదీ తీరాలు దాటి పెద్ద పులులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా నుండి ఆక‌లి, దప్పిక ఆవాసం కోసం ఇక్కడికి వస్తున్నాయి. ముఖ్యంగా నదీ ప్రవాహం తగ్గిపోవడంతో మహారాష్ట్రలోని కిన్వట్, మాహుర్ అటవీ ప్రాంతం గుండా ఆదిలాబాద్, బోత్, సారంగాపూర్, కుంటాల, నర్సాపూర్ మండలాలకు వలస వస్తున్నాయి. గత వారం రోజుల్లోనే నిర్మల్ జిల్లాలో ఒక ఆవు, మేకల మందపై దాడులు చేసిన పులి శివారు గ్రామ ప్రజలను హడలెత్తిస్తోంది. సుమారు 50గ్రామాల్లో ప్రజలు పంట చేలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

చేతికి వచ్చే దశలో ఉన్న పత్తి పంట ఏరేందుకు వెళ్తూ మధ్యాహ్నంలోపే ఇంటి ముఖం పడుతున్నారు. సారంగాపూర్, మామడ, సూర్యపూర్, నర్సాపూర్ జి, అంబుగాం అటవీ ప్రాంతంలో చిరుత పాదముద్రలు కూడా అటవీ అధికారులు సేకరించారు. ఈ లెక్కన సరిహద్దులు దాటి తిప్పేశ్వర్ నుండి మూడు పెద్ద పులులు, రెండు చిరుతలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోకి ప్రవేశించినట్టు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకోసం పులుల ట్రాప్ కోసం16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కవ్వాల్ టైగర్ జోన్ లో ఒక పులి కూడా లేనందున తాజాగా కనిపించిన ఈ పులిని కవ్వాల్ అటవీ పరిధిలోకి తరలించేలా అటవీ అధికారులు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement