Thursday, April 25, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్ని పేదలకు పంచుతాం: బండి సంజ‌య్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరిపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరులో పాల్గొన్న బండి సంజయ్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 2023లో తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను, ఫామ్ హౌస్‌ను ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నుతామ‌ని, ఆ భూమిని ప్ర‌జ‌ల‌కు పంచుతామని అన్నారు.  పోడు భూముల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని మండిప‌డ్డారు.  ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్, ఒక్కొక్క ద‌ళితుడికి రూ.10 ల‌క్ష‌లు కాదు, రూ.30 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని అన్నారు.  రాష్ట్రంలో 18శాతం ధ‌ళితులు ఉన్నార‌ని, వారిలో ఏ ఒక్క‌రికీ ముఖ్య‌మంత్రి అయ్యే అర్హ‌త‌లు లేవా అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.

ఇక హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ ఫేక్ ఐడీలు సృష్టించి ద‌ళితుల‌ను మోసం చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌లో జరుగుతుంది బైపోల్స్ కాదని, కేసీఆర్‌కు బైయింగ్ ఎలక్షన్స్ అని అన్నారు. కేసీఆర్‌పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై సీఎంకు చితశుద్ది లేదని విమర్శించారు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని, ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల బావమరిది చాటింగ్‌పై విచారణ జరిపించాలని సవాల్ చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement