Friday, December 6, 2024

BIG STORY: మరోసారి మార్కెట్‌ విలువల పెంపు.. ఆస్తులు, భూముల విలువ పెంపు ప్రతిపాదనలు..

ప్రజలపై భారం పడకుండా ఖజానాను పరిపుష్టం చేసుకునేందుకు సర్కార్‌ సమాయత్తమవుతోంది. భారీగా పెరిగిన భూములు, ఆస్తులు, ప్లాట్లు, ఇండ్ల విలువలను మరోసారి సహేతుకతతో పెంచుకునేలా కార్యాచరణ ప్రారంభించింది. తద్వారా ఓపెన్‌ మార్కెట్‌లో ఉన్న విలువలను పరిశీలించి మరింత ఆదాయం రాబట్టుకోవచ్చని భావిస్తోంది. గతే డాది జూలైలో ఏడేళ్ల అనంతరం ప్రాంతాల వారీగా 30నుంచి 300వాతం వరకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఫిబ్రవరి 1నాటికి పూర్తి ప్రతిపాదనలతో సిద్ధం అవుతోంది. ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సీసీఎల్‌ఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత ఫార్మాట్‌లో ప్రతిపాదనలను రూపొందించి అందించాలని కోరారు. ఈ రెండు శాఖల అధికారులు గురువారం సమావేశమయ్యారు. ఐజీ కార్యాలయంలో డీఐజీలు డీఆర్‌లతో భేటీ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ దఫా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల విలువలను పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలుస్తోంది. అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెదడంతోపాటు, ప్రాజెక్టులు, రోడ్లు అందుబాటులోకి రావడం, పరిశ్రమల స్థాపన, ట్రిపుల్‌ ఆర్‌ వంటి రహదారుల ఆగమనం సిద్ధమవుతున్న కారణంగా ఓపెన్‌ మార్కెట్‌లో వ్యవసాయ భూములకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

రాష్ట్రంలో ఏ మారుమూలకు వెళ్లినా ఎకరం రూ.30లక్షలకు లోబడి దొరక డంలేదు. రంగారెడ్డి, మేడ్చెల్‌, వికారాబాద్‌ శివారు జిల్లాల్లో ఈ దఫా వ్యవసాయ భూములకు 300 శాతంపైగా పెంపు వర్తింపజేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దీంతో 2021- 22లో మరోసారి మార్కెట్‌ విలువల పెంపుకు సిద్ధమైనట్లేనని తెలుస్తోంది. దీంతో ప్రజలపై నేరుగా పన్నుల భారం మోపకుండా, ఖజానాకు ఆదాయం పెంచి ప్రజాసంక్షేమ పథకాల అమలులో లోటు లేకుండా ముందుకెళ్లాలని యోచిస్తోంది. రాష్ట్రంలో రియల్‌ బూమ్‌తో భారీగా పెరిగిన భూముల ధరలకు వాస్తవ ధరలతో సమానంగా మార్కెట్‌ విలువలను నిర్ధారించి రిజిస్ట్రేషన్‌ రుసుముల రూపంలో రాబడి పెంచుకునేందుకు బడ్జెట్‌ అంచనాల రూపంలో ఆమోదముద్ర వేసింది. భూములు, భవనాల మార్కెట్‌ విలువల పున: సమీక్ష, సవరణ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఆగష్టులో చివరగా ఆమోదించిన ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం తర్వాత గతేడాది జూన్‌లో పెంపుదలకు ఆమోదం తెలిపింది. అయితే ప్రతి రెండేళ్లకోసారి మార్కెట్‌ విలువల సమీక్షచేసి వాస్తవ విలువలను నిర్ధారణ చేయాలని చట్టంలో ఉంది. రాష్ట్రంలో నెలకొన్న విప్లవాత్మక అభివృద్ధి, వికేంద్రీకరణ చర్యలతో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. దీంతో ప్రస్తుత భూముల విలువలను 10నుంచి 100శాతం మేర పెంచాలని యోచిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ విలువలకు సమీపంగా కార్డు వ్యాల్యూగా పిలిచే అధికారిక విలువలను నిర్ధారించాలని భావిస్తున్నారు.

ఏ క్షణంలోనైనా మార్కెట్‌ విలువల పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్‌ విలువల పెంపుపై విస్తృత కసరత్తు చేస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల వారీగా సబ్‌ రిజిస్ట్రార్లతో గడచిన మూడు రోజులుగా కార్డ్‌ విధానంలో ఉన్న మార్కెట్‌ విలువలపై నాలుగు శ్లాబుల్లో మదింపు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో, హెచ్‌ ఎండీఏ, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో 30 శాతంగా, గ్రామపంచాయతీల్లో ఎక్కువ శాతం వరకు మార్కెట్‌ విలువలు పెంచుకు నేందుకు అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయేతర భూముల విలువ ఎక్కువ మొత్తంలో పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు 20నుంచి 40శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని జిల్లా కేంద్రాలు, శివారు ప్రాంతాలు అంతటా ప్రాంతాన్ని బట్టి 60నుంచి 150 శాతం మార్కెట్‌ విలువల పెంపు ఉండొచ్చని తెలిసింది.

పెంపుదల ఇలా..!
వార్డు, బ్లాక్‌ ఆధారంగా ఇండ్లు, ఫ్లాట్‌ల మార్కెట్‌ విలువల ధరలు ఖరారు చేయనున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా పరిషత్‌ రోడ్లు, గ్రామ పంచాయతీ రోడ్లు, వాణిజ్య ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలు, అన్ని వసతులున్న ఏరియాల ప్రాతిపదికగా విలువల నిర్ధారణకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పట్టణాలకు, నగరాలకు సమీపంలోని వ్యవసాయ భూముల జాబితా కూడా వాణిజ్య ధరలకు మారనుంది. గ్రామాల్లోని ఇండ్ల స్థలాలను గ్రామం యూనిట్‌గా, గ్రామకంఠం స్థలాలకు నామమాత్రపు ధరలు, రహదారులపై ఉండే స్థలాలకు ఎక్కువగా విలువలను నిర్ధారించే అవకాశాలున్నాయి.

నిర్మాణాలకు కూడా పెంపుదల..
భూములు, ఓపెన్‌ ప్లాట్లతోపాటు భవనాల విలువలను సవరించిన ప్రభుత్వం స్ట్రక్చరల్‌ రేట్లను సవరించి ధరలను ఖరారు చేసింది. ఇంటిపెండెంట్‌ ఆర్‌సీసీ భవనాలకు చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో రూ.1100, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 900 లుగా నిర్దారించారు. ఆర్‌సీసీ కాని భవనాలకు పట్టణ ప్రాంతాల్లో రూ.750, గ్రామీణ ప్రాంతాల్లో రూ.600లుగా ధరలను ఖరారు చేశారు. ఫౌండేషన్‌ స్థాయి వరకు పూర్తయిన భవనాల విలువ 25శా తంగా, స్లాబ్‌ వరకు పూర్తయిన భవనలకు 65శా తంగా, ఫినిషింగ్‌ స్థాయి వరకు పూర్తయిన భవనాలకు 85శాతంగా నిర్ణయించారు. భవనాలు నిర్మించి 10ఏళ్లు దాటితే విలువలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం పేర్కొంది. పదేళ్లకు పైబడిన భవనాలకు ప్రతి సంవత్సరానికి ఒక శాతం చొప్పున విలువలను తగ్గిస్తారు. ఇది గరిష్టంగా 70శాతంకంటే ఎక్కువగా తగ్గించేందుకు వీలు లేదు. దీని ధృవీ కరణను స్థానిక, పట్టణ, కార్పొరేషన్‌ పాలక మండళ్లనుంచి తీసుకో వాలని పేర్కొన్నారు. గతేడాదినుంచే రాష్ట్రవ్యాప్తంగా పెంచిన భూముల మార్కెట్‌ విలువల సరికొత్త ధరలు, 6శాతంనుంచి 7.5శాతానికి పెంచిన స్టాంపు డ్యూటీ అమలులోకి వచ్చాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement