Thursday, April 18, 2024

Big Story: పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం.. మాజీల తండ్లాట!

వీళ్లంతా మాజీ మంత్రులే.. ఇప్పుడు వారి ఫ్యూచ‌ర్ పాలిటిక్స్ కోసం తండ్లాడుతున్నారు. రాజ‌కీయాల‌ను శాసించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సీనియ‌ర్ నేత‌ల సిచ్యుయేష‌న్ ఏంటో తెలుసుకుందామా..

ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌ : మాజీ మంత్రులు ఏ.చంద్రశేఖర్‌.. ప్రసాద్‌ కుమార్‌.. మహేందర్‌రెడ్డి జిల్లా రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏ.చంద్రశేఖర్‌, ప్రసాద్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. ఇటీవల ఏ.చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ప్రసాద్‌కుమార్‌ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇక తాండూరు ప్రాంతానికి చెందిన పట్నం మహేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు మాజీ మంత్రుల రాజకీయ భవిష్యత్తుపై ఇటీవల కాలంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్వ వైభవం కోసం ఈ ముగ్గురు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ముళ్లబాటలో చంద్రశేఖర్‌
వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ రాజకీయ ప్రయాణం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. మొదట ఆయన టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో మొదటిసారి మంత్రిగా పనిచేశారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌ స్థాపించిన టిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్పార్ హ‌యాంలోనూ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. టిఆర్‌ఎస్‌ను వీడిన తరువాత ఆయన రాజకీయ ప్రయాణం సాఫీగా సాగలేదు.

కష్టాల కడలిలో ప్రసాద్‌కుమార్‌
వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ కూడా రాజకీయంగా పుంజుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ఓడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన సతీమణి కూడా మరణించారు. దీంతో ఆయన మానసికంగా కొంత కుంగిపోయినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొద్ది కాలంగా ఆయన టిఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. ఇటీవల రేవంత్‌రెడ్డి పీసీసీ పీఠం అధిష్టించిన త‌ర్వాత‌ ప్రసాద్‌కుమార్‌ కొంత క్రియాశీలంగా మారారు.

వైఎస్పార్ హయాంలో మంత్రి పదవి చేపట్టారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఈ సమయంలో ఉమ్మడి జిల్లాను ఆయన ఒంటిచేతితో ముందుకు తీసుకపోయారు. ఇటీవల కాలంగా ఆయన తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొం టున్నారు. కాంగ్రెస్‌లో మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం పార్టీని వీడడంతో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ ఒంటరిగా మిగిలిపోయారు.

- Advertisement -

‘పట్నం’ వేటలో కాంగ్రెస్‌..
తాండూరు నియోజకవ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదట సాఫీగానే సాగినా ఇటీవల కాలంలో కొంత అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసి 1994లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో వైఎస్‌ హవాలో ఒడిపోయారు. తిరిగి 2009లో గెలి చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తరువాత ఆయన తెదేపాను వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన ఎన్నికలలో గెలిచి కేసీఆర్‌ మంత్రివర్గంలో చేరారు. గత ఎన్నికలలో అనూహ్యంగా ఓడిపోయారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆవెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీచేసి గెలిచారు. వచ్చే డిసెంబర్‌లో ఆయన ఎమ్మెల్సీ పదవికాలం పూర్తి అవుతోంది. తిరిగి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగైనా మంత్రి కావాలని మహేందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు రాజకీయ సమీకరణాలు కలిసి రావడం లేదు. 2014 నుంచి 2018 చివరి వరకు ఆయన ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలో తన విశ్వరూపం ప్రదర్శించారు. ప్రస్తుత రాజకీయాలు ప్రతికూలంగా మారడంతో ఆయన పూర్వ వైభవం కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

గత కొద్ది కాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ప్ర చారం జరుగుతోంది. దీనిని ఆయన ఖండించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడే కాంగ్రెస్‌లో చేరాలని ఆపార్టీకి చెందిన పలువురు నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement