Thursday, March 23, 2023

తెలంగాణ అభివృద్ధిపై బిజెపిది పక్షపాత వైఖరి.. చాడ వెంకట రెడ్డి

హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి విమర్శించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం పట్ల బిజెపి వివక్షత, దురుద్దేశంతో వ్యవహరిస్తున్నదని, పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన హామీలను అమలు చేయని బిజెపికి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు ముందుకు పడలేదని తెలిపారు. బిజెపి, ఎన్డీయే సాచివేత వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిపిఐ ప్రజాపోరు యాత్రను ప్రారంభిస్తున్నదని తెలిపారు. 150 మంది పాల్గొంటున్న ఈ పాదయాత్ర ద్వారా బిజెపికి కనువిప్పు కలగాలని, ఈ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుందన్నారు. అలాగే తెలంగాణ కోసం పోరాడిన లౌకిక పార్టీల మద్దతు కూడగట్టి విభజన హామీల అమలుకు జాతీయ స్థాయిలో పోరాడుతామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రజలను చైతన్య పరుస్తూ విభజన హామీలను సాధించేందుకే సిపిఐ ప్రజాపోరు యాత్ర చేపట్టిందన్నారు.

- Advertisement -
   

ఈ పాదయాత్ర బయ్యారంలో ఈనెల 25న ప్రారంభమై ఏప్రిల్ 5న హనుమకొండలో ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ కుడా మైదానంలో బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరుకానున్నారని తెలిపారు. ఇతర పార్టీలు పాదయాత్రలు చేపట్టేది కుర్చీ కోసమేనని, తాము ప్రజల కోసం, హామీల సాధన కోసం పాదయాత్ర చేపడుతున్నామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, సిహెచ్ రాజారెడ్డి, బి. విజయ సారథి, రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వర్ రావు, పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, మద్దెల ఎల్లేష్, నాయకులు ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్, దండు లక్ష్మణ్, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రజాపోరు యాత్ర వాల్ పోస్టర్ లను విడుదల చేశారు.


పంటల నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి :
వడగండ్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్ల వాన, ప్రకృతి కన్నెర్ర చేయడంతో చేతికి వచ్చిన పంట పూర్తిగా ద్వంసమై రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మండల స్థాయిలో అధికారులచే కమిటీలు వేసి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement