Friday, October 4, 2024

Bhadrachalam – రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

భద్రాచలంలో. రూ. కోటి విలువైన గంజాయి అక్రమ రవాణా పట్టుబడింది. భారీగా గంజాయిని తరలిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుతో పాటు మరో కేసులో తల్లి కొడుకు కూడా పట్టుబడ్డారు.

నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడు మహమ్మద్ మునవర్ అలీ ప్రధాన నిందితుడు కావడం విశేషం.

గత కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోలీసులు కన్నుగప్పి గంజాయి అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన 319 కేజీల గంజాయిని , రెండు కార్లు, రెండు బైకులు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఈ గంజాయి అక్రమ రవాణాలో నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ కుమారుడైన మునావర్ ఆలీతో పాటు మరో కుటుంబం పూర్తిగా గంజాయి వ్యాపారంలో మునిగి తేలుతుంది.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల అరుణ, ఆమె కుమారుడు నేరెళ్ల అఖిల్ ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు నుంచి 100 కేజీల గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. తల్లీ కొడుకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడడం విశేషం. నేరెళ్ల అరుణ భర్త కూడా సదయ్య గంజాయి వ్యాపారం చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

అయితే ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేకసార్లు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ మునావర్ అలీ.. వీరితో చేతులు కలిపి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు వీరిని భద్రాచలం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకమని ఇలా పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అలాగే సమాజ హితం కోసం ఎవరు కూడా మత్తు పదార్థాలు అలవాటు కావద్దని.. ముఖ్యంగా మత్తు పదార్థాలు అలవాటు పడిన యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని పేర్కొన్నారు. అత్యంత చాకచక్యంగా అంతర్రాష్ట్ర గంజాయి ముఠా ఆట కట్టించిన భద్రాచలం ఎక్సైజ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement