Thursday, March 23, 2023

ల‌క్ష్యం చేర‌ని కేటాయింపులు – ప‌ద్దుల్లో ప‌ద‌నిస‌లు..

హైదరాబాద్‌: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ పద్దుల్లో సంక్షేమరంగం లక్ష్యం చేరగా, మిగతా కేటాయింపుల విడుదలలో కొంత జాప్యం తలెత్తింది. కేంద్ర సర్కార్‌ సాయమందజేతలో అస్పష్టత కారణంగా బడ్జెట్‌లో రూ. 45వేల కోట్లు లోటు ఏర్పడగా, ప్రస్తుత ఆర్ధిక ఏడాది రూ. 2.56లక్షల కోట్ల బడ్జెట్‌లో వాస్తవికంగా చేసిన ఖర్చులు, సమకూరిన రాబడులతో సవరించిన బడ్జెట్‌ సిద్ధమవుతోంది. అసలు లక్ష్యాల్లో కొంత మందగమనం ఎప్పుడైనా సహజమేకాగా, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం చూపలేదని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రధానంగా నిరుద్యోగ భృతికి రూ. 3వేల కోట్లు కేటాయించినప్పటికీ ఈ పథకం మొదలు పెట్టలేదు. దళితబంధు పథకానికి బడ్జెట్‌లో రూ. 17,700కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ పథకం అమలులో నెలకొన్న సందిగ్ధత కారణంగా లక్ష్యం చేరలేదు. ఒక్కో శాసనసభా నియోజకవర్గంలో 1500 మంది చొప్పున రూ. 10లక్షలు ఆర్ధిక సాయం చేసి దళితుల అభ్యున్నతే లక్ష్యంగా అమలులోకి తెచ్చిన ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఆచరణలో సఫలం కాలేదు. దీంతో నిధుల విడుదల నిల్చిపోయింది.

- Advertisement -
   

ప్రస్తుత బడ్జెట్‌(2022-23)లోనే సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లు కట్టుకునేందుకు రూ. 3లక్షల ఆర్ధిక సాయం పథకంపై ఎటువంటి కసరత్తు లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. ఈ ఏడాది 4లక్షల మందికి సాయం అందించాలన్న లక్ష్యం మార్గదర్శకాలు రాకపోవడంతో ఒక్క అడుగూ మందుకు పడలేదు. ఇక పాతబస్తీ మెట్రో కనెక్టివిటీకి రూ. 500కోట్లు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించినప్పటికీ ఈ పనులు ఇంకా మొదలు కాలేదు. అసలు అలైన్‌మెంట్‌ కార్యాచరణ కూడా మొదలవకపోవడంతో నిధుల విడుదల నిల్చిపోయింది. ప్రస్తుత ఏడాదిలో రూ. 75వేల వరకు రైతు రుణమాఫిీకి నిధులు కేటాయించినప్పటికీ 7లక్షల మందికి రూ. 4వేల కోట్ల నిధులు నిల్చిపోయాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌ను రైతాంగానికి అందజేస్తున్న ప్రభుత్వం ఈ మేరకు సబ్సిడీలను డిస్కంలకు చెల్లించకపోవడం శాపంగా మారింది. దీంతో నష్టం భర్తీ చేసుకునే కార్యాచరణ ఇతర మార్గాల్లో డిస్కంలు మొదలెట్టాయి.

యాదవ, కుర్మలకు ఉచిత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్కార్‌ రూ. 1000 కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా ఒక్క పైసా విడుదల కాలేదు. విద్యార్ధుల ఉపకార వేతనాలకు తెలంగాణ సర్కార్‌ మొదటినుంచీ అత్యంత ప్రాధాన్యతనిచ్చినప్పటికీ ఇందుకు కేటాయించిన రూ. 4688కోట్లు బడ్జెట్‌ రిలీజ్‌ చేయలేకపోయింది. లక్షమంది భవన నిర్మాణ కార్మికులకు ఉచిత మోపెడ్‌ల మాట మర్చిపోయారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పటికీ ఈ పథకం అమలులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పెండింగ్‌లో పడిపోయింది.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం నిధుల విడుదలలో కొంత నిరాసక్తత ప్రదర్శించింది. ఎస్టీల సంక్షేమానికి రూ. 12,565కోట్లలో 80శాతం లక్ష్యం చేరినట్లు తెలిసింది. గిరిజన ఆవాస ప్రాంతాలకు రహదారుల వసతి విస్తరణకు కేటాయించిన రూ. 1000 కోట్లు విడుదల కాలేదని అంటున్నారు. కాళేశ్వరం టూరిజం సర్య్కూట్‌కు రూ. 750కోట్ల కేటాయింపుల్లో కూడా మెజార్టీ నిధుల విడుదల సఫలం కాలేదు. అదనంగా 2.50లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించేందుకు రూ. 1000కోట్లు కేటాయించినా లక్ష్యం చేరలేదు. పంటల మద్దతు ధర పడిపోయిన సందర్భాల్లో రైతుల నుంచి మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌ జోక్యం నిధుల కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. సాగునీటి రంగానికి రూ. 22675కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం రాష్ట్ర పద్దునుంచి రూ. 9959కోట్లు, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలనుంచి రుణంగా రూ.12716 కోట్లు అంచనా వేసుకుంది.

అయితే ఇందులో భారీగా గండి పడింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ప్రస్తుత ఏడాదిలో రూ. 377 కోట్లు కేటాయింపులు చేయగా, ఇందులో పాతబస్తీ మెట్రోకు రూ. 500 కోట్లు, రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రోకు చేసిన కేటాయింపులు విడుదల కాలేదు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ. 2142కోట్లు, విద్యుత్‌ రాయితీకి రూ. 190కోట్లు ఖర్చు చేయలేదు. విద్యుత్‌ రాయితీ రూ. 10,700కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో డిస్కంలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ప్రచారం జరుగుతోంది. సంక్షేమరంగానికి రూ. 31వేల కోట్లకు మించి ఖర్చు చేసిన తెలంగాణ సంక్షేమ సర్కార్‌, ప్రస్తుత ఏడాదిలో రైతు, సంక్షేమ, వైద్య రంగాలను ప్రాధాన్యతా క్రమంలో భారీగా నిధులను విడుదల చేసింది. కానీ ఇదే సమయంలో పలు రంగాలను నిధుల విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉండగా, కేంద్రంనుంచి అందాల్సిన గ్రాంట్లు, నిధులు, సాయాల్లో రూ. 56వేల కోట్లు కోతలు పడటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. మొత్తం రాబడులలో తెలంగాణ 19శాతం వృద్ధిరేట్లను నమోదు చేసుకున్నది. తీవ్రమైన ఆర్ధిక సవాళ్లు ఉన్నప్పటికీ పథకాలను సకాలంలో అమలు చేసే ప్రయత్నాలు 80శాతం లక్ష్యం చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement