Wednesday, March 22, 2023

బిజెపిలో సిగ‌ప‌ట్లు – బండిపై రోజు రోజుకి పెరుగుతున్న అస‌మ్మ‌తిరాగాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య అంతర్గతపోరు రోజు రోజుకు తీవ్రమవుతోంది. అసెంబ్లి ఎన్నికల ముంగిట ముఖ్యనేతల మధ్య అభిప్రాయబేదాలు తారాస్థాయికి చేరుతుండడంతో ఏమి చేయాలో ఆ పార్టీ అధిష్టానానికి పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏకంగా అమిత్‌ షా హెచ్చరించినా కూడా పార్టీ ముఖ్య నేతల మధ్య అసంతృప్తి రోజు రోజుకూ తీవ్రస్తాయిలో బహిరంగంగానే చోటు చేసుకుంటుండడం గమనార్హం. ముఖ్యనేతలంతా ఐకమత్యంతో ఉంటూ సమన్వయంతో ముందుకుసాగాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించిన గంటల వ్యవథిలోనే బీజేపీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం కావడం పార్టీ అధిష్టానాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ఆదివారం సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలంతా ఐఖమత్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశించిన గంటల వ్యవథిలోనే పార్టీలో కీలక నేత, నిజామాబాద్‌ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

- Advertisement -
   

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్‌ సెంటర్‌ కాదని, అది నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన పదవి అని బీజేపీలో బండి సంజయ్‌ తీరుపై నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు సమసిపోకముందే బీజేపీలో 50ఏళ్ల సీనియర్‌ నేత పేరాల శేఖర్‌రావు బండి సంజయ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బండి సం జయ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సమర్ధించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌వి అసందర్భ, పరిణతిలేని మాటలు అని తేల్చి చెప్పారు. బండి సంజయ్‌ వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు తెలంగాణ బీజేపీని ప్రజలకు దూరం చేస్తున్నాయని మండిపడుతున్నారు. మసీదుల తవ్వకాలు, ముద్దులు తదితర వ్యాఖ్యలు బీజేపీ సంస్కృతి కాదన్నారు. బండి సంజయ్‌ ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, నేతల అవినీతిపై ఆరోపణలు చేసి, వారిని రెచ్చగొట్టి ఆ తర్వాత అంతర్గతంగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ గ్రానైట్‌ వ్యవహారం, జూపల్లి రామేశ్వర్‌రావు మైనింగ్‌ అక్రమా లని బెదిరించి ఆ తర్వాత సెటిల్‌మెంట్లు చేసుకుం టున్నాడని మండిపడ్డారు. బండిసంజయ్‌ కారణంగా పార్టీలో వినే, చర్చించే పరిస్థితులు లేవన్నారు.

మరోవైపు బండి సంజయ్‌ ఎంతసేపు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలపై ప్రశంసలు కురిపిస్తూ వారి మెప్పు కోసమే ఆరాటపడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, రాష్ట్ర ముఖ్య నాయకులతో మాత్రం ఆయన కలిసి ముందుకుసాగటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు మొఖ్యనేతలు కూడా బండి నాయకత్వ తీరు, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న వైనంపై చాలాకాలంగా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ మాజీఅధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్‌ కూడా బండి సంజయ్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల విషయంలో వారు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ బీజేపీలో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన సీనియర్‌ నేతలే ఉన్నారు. వీరిలో మాజీ ఎంపీలు వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు తదితరులు కూడా పలుమార్లు బండి సంజయ్‌ తీరుపై అధిష్టానం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తె లిసింది. కొంత మంది నేతలైతే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్‌కు కట్టబెడితే బాగుంటుందని కూడా అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అయితే కేంద్ర నాయకత్వం మాత్రం ఎన్నికల వరకు బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేయడంతో నేతల మధ్య అంతర్గత అసంతృప్తి మరింత తీవ్రంగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేతలు కలిసికట్టుగా ఉంటూ రానున్న అసెంబ్లి ఎన్నికలను ఎదుర్కోవాల్సిన తరుణంలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో తరచూ కీచులాడుకుంటూ ఆ పంచాయితీని అధిష్టానం వద్దకు తీసుకెళ్తుండడంతో సరైన దిశానిర్దేశం లేక కిందిస్తాయి కేడర్‌లో అయోమయం నెలకొందన్న ఆవేదన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇలా ముఖ్యనేతలతోపాటు ఎంపీ అర్వింద్‌, పేరాల శేఖర్‌రావు వరుసగా రోజుకో నేత బండి సంజయ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో అసెంబ్లి ఎన్నికల ముంగిట బీజేపీ క్యాడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతినడం ఖాయమన్న ఆందోళన బీజేపీ నేతల్లో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement